ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు | Prime Volleyball League receives international recognition | Sakshi
Sakshi News home page

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

Jul 9 2026 4:02 AM | Updated on Jul 9 2026 4:02 AM

Prime Volleyball League receives international recognition

ఫస్ట్‌ డివిజన్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌గా గుర్తించిన అంతర్జాతీయ వాలీబాల్‌ సమాఖ్య

న్యూఢిల్లీ: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నాలుగు సీజన్‌ల నుంచి విజయవంతంగా సాగుతున్న పీవీఎల్‌కు అంతర్జాతీయ వాలీబాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) అధికారిక గుర్తింపు ఇచి్చంది. భారత్‌లో ‘ఫస్ట్‌ డివిజన్‌ ప్రొఫెషనల్‌ లీగ్‌’గా పీవీఎల్‌ను గుర్తిస్తున్నట్లు ఎఫ్‌ఐవీబీ బుధవారం ప్రకటించింది. ఈ లీగ్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది నవంబర్‌ 30 నుంచి ప్రారంభం కానుందని లీగ్‌ నిర్వాహకులు వెల్లడించారు. దీని కోసం వచ్చే నెల 17న గోవాలో ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. దేశవిదేశాల ప్లేయర్లు ఈ వేలంలో భాగం కానున్నారు. 

ఎఫ్‌ఐవీబీ గుర్తింపుతో ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో పాల్గొనే భారత క్లబ్‌లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే అవకాశం దక్కనుంది. నిబంధనల ప్రకారం అర్హత సాధిస్తే... ఇక మీదట భారత క్లబ్‌లు ‘సెంట్రల్‌ ఏషియన్‌ వాలీబాల్‌ సంఘం’, ‘ఏషియన్‌ వాలీబాల్‌ కాన్ఫెడనేషన్‌’ టోర్నమెంట్‌లలో పాల్గొనే అవకాశం దక్కనుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మేటి జట్లతో తలపడే అవకాశం మన ఆటగాళ్లకు లభించనుంది. 

‘నాలుగేళ్లుగా మేము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎఫ్‌ఐవీబీ గుర్తింపు దక్కడంతో పీవీఎల్‌ స్థాయి మరింత పెరిగింది. భారత వాలీబాల్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఇదొక కీలక మలుపు. యువతరం వాలీబాల్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది’ అని పీవీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ప్రారంభమైన తర్వాత గత నాలుగేళ్లలో అతర్జాతీయ స్థాయిలో భారత జట్టు ఎంతో మెరుగైంది. గతంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 60వ స్థానంలో ఉన్న భారత జట్టు... ఇప్పుడు 42వ స్థానానికి ఎగబాకడమే దీనికి నిదర్శనమని పీవీఎల్‌ సీఈవో జాయ్‌ భట్టాచార్య పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement