కరాచీ: పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్) తమ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీమ్‌కు కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియన్ కొలిన్ బ్యాచ్ స్థానంలో స్వదేశీ కోచ్‌ను ప్రకటించింది.
మాజీ ఒలింపియన్ మన్‌జూర్ ఉల్ హసన్ పాక్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. రాబోయే ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్, ప్రపంచ కప్‌లలో పాల్గొనే టీమ్ మన్‌జూర్ శిక్షణలోనే సన్నద్ధమవుతుంది. మాజీ ఆటగాళ్లు హసన్ సర్దార్, ఇస్లాహుద్దీన్ సిద్దిఖీలతో కూడిన పీహెచ్‌ఎఫ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కమిటీ సిఫారసుపై కొత్త కోచ్ ఎంపిక జరిగింది.
తీవ్ర అసంతృప్తి
అయితే మన్‌జూర్‌ను కోచ్‌గా నియమించడంపై పాక్ జట్టులో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తాజా నిర్ణయం పట్ల వారు నిర్ఘాంతపోయారు. 70వ, 80వ దశకాల్లో డిఫెండర్‌గా మన్‌జూర్ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
అనూహ్య ప్రకటన
‘ఆటగాడిగా మన్‌జూర్‌కు మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. అయితే కోచ్‌గా ఆయనను ఎంపిక చేయడం అంటే తీవ్ర నిరాశాజనక ఫలితాలను కొనితెచ్చుకోవడమే. కొలిన్ బ్యాచ్ అన్ని రకాలుగా అర్హుడైన కోచ్. మేమంతా ఆయన శిక్షణతో సంతోషంగా ఉన్నాం.
ఆధునిక హాకీకి సంబంధించి అన్ని అంశాలపై అవగాహన ఉంది. ప్రొ లీగ్, వరల్డ్ కప్‌లాంటి పెద్ద ఈవెంట్లలో మమ్మల్ని కొలిన్ సమర్థంగా నడిపిస్తాడని భావించిన తరుణంలో ఈ అనూహ్య ప్రకటన వచ్చింది’ అని పాక్ జాతీయ జట్టులోని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది.
చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు


