NZ Vs Eng: మరీ ఇలా కూడా అవుట్‌ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా?

NZ Vs Eng: Cheeky Foakes Lazy Michael Bracewell Run Out Watch - Sakshi

New Zealand vs England, 2nd Test: రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తోంది న్యూజిలాండ్‌. పర్యాటక ఇంగ్లిష్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి  435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆతిథ్య కివీస్‌ 209 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ కావడంతో ఫాలో ఆన్‌ ఆడించింది.

అనూహ్య రీతిలో
అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని ఇంగ్లండ్‌కు షాకిచ్చింది న్యూజిలాండ్‌. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(83), డెవాన్‌ కాన్వే(61)లకు తోడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ బ్యాట్‌ ఝులిపించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది.

కేన్‌ 132 పరుగులు చేయగా.. డారిల్‌ మిచెల్‌(54), టామ్‌ బ్లండెల్‌(90) కూడా అర్ధ శతకాలతో రాణించడంతో 483 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ రనౌట్‌ అయిన తీరు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

మరీ ఇంత బద్ధకమా?
158.2 ఓవర్లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో బ్లండెల్‌ షాట్‌ బాది... బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, మూడో పరుగుకు ఆస్కారం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తగా.. బ్రేస్‌వెల్‌ రనౌట్‌ అయ్యాడు.

క్రీజు దగ్గరికి చేరినప్పటికీ బ్రేస్‌వెల్‌ బద్దకం ప్రదర్శించాడు. బ్యాట్‌, బ్రేస్‌వెల్‌ కాలు గాల్లోనే ఉండటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ లిప్తపాటులో బంతిని వికెట్లకు గిరాటేశాడు. 

దీంతో కివీస్‌ మరో వికెట్‌ కోల్పోయింది. అయితే, విలియమ్సన్‌ సహా మిగతా బ్యాటర్లు జట్టును గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రదర్శించగా.. బ్రేస్‌వెల్‌ ఇలా రనౌట్‌ కావడంతో ఫ్యాన్స్‌ అతడిని విమర్శిస్తున్నారు. ఇంత బద్దకమా.. ఇంత తేలికగా వికెట్‌ పారేసుకోవడం ఏమిటి? నీ తీరు అస్సలు బాగోలేదు’’ అని మండిపడుతున్నారు.

రెండు టెస్టుల్లోనూ విఫలం
బ్రేస్‌వెల్‌  తొలి టెస్టులో 7 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి వైఫల్యాన్ని కొనసాగించాడు. ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన కివీస్‌.. ఇం‍గ్లండ్‌కు 258 పరుగుల టార్గెట్‌ విధించింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది.

చదవండి: Kane Williamson: పార్ట్‌టైమ్‌ పేసర్‌ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్‌ మామ! వీడియో వైరల్‌
Ind Vs Aus 3rd Test: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు! కళ్లన్నీ అతడిపైనే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top