కేన్‌-సాంట్నర్‌ ఫైట్‌.. 'బాక్స్‌' యుద్దం | New Zealand Teammates Clash Off The Field | Sakshi
Sakshi News home page

కేన్‌ vs సాంట్నర్‌.. 'బాక్స్‌' యుద్దం

Jun 2 2026 5:41 PM | Updated on Jun 2 2026 6:16 PM

New Zealand Teammates Clash Off The Field

క్రికెట్‌లో ఆటగాళ్ల భద్రతకు గత మూడు దశాబ్దాల్లో విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. హెల్మెట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్‌, ఛెస్ట్‌ గార్డులు, ఆర్మ్‌ ప్రొటెక్టర్లు వంటి పరికరాలు ఆధునిక సాంకేతికతతో మరింత సురక్షితంగా మారాయి. అయితే పురుష క్రికెటర్లకు అత్యంత సున్నితమైన భాగాన్ని రక్షించే 'అబ్డొమినల్‌ గార్డ్‌' లేదా 'బాక్స్‌' విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు 1970ల నుంచి వాడుతున్న డిజైన్‌నే ఇప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు ఉపయోగిస్తున్నారు.

ఇటీవల ఆటగాళ్ల భద్రతపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్‌ తిలక్‌ వర్మ టెస్టిక్యులర్‌ టార్షన్‌తో బాధపడిన ఘటన తర్వాత క్రికెటర్ల రక్షణ పరికరాలపై కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌కు చెందిన ఇద్దరు మాజీ, ప్రస్తుత క్రికెటర్ల కుటుంబాలు అభివృద్ధి చేసిన రెండు కొత్త తరహా అబ్డొమినల్‌ గార్డులు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆసక్తికర పోటీకి కారణమయ్యాయి.

కేన్‌ విలియమ్సన్‌ తన సంస్థ 'కవర్‌' (Cover) ద్వారా కొత్త తరహా బాక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అల్యూమినియం మిశ్రమంతో తయారైన ఈ గార్డ్‌ పగలకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా షాక్‌ను గ్రహించే ప్రత్యేక ఫోమ్‌ను కూడా ఇందులో ఉపయోగించారు. గతంలో తాను వాడిన గార్డులు దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో మరింత బలమైన ఉత్పత్తిని రూపొందించినట్లు విలియమ్సన్‌ చెబుతున్నాడు.

మరోవైపు మిచెల్‌ సాంట్నర్‌ సోదరుడు ఎలియట్‌ సాంట్నర్‌, ఓటాగో క్రికెటర్‌ రూబెన్‌ క్లింటన్‌ కలిసి 'ట్రూగార్డ్‌' (TruGuard) అనే ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్‌తో తయారైనప్పటికీ 'జైరాయిడ్‌ లాటిస్‌' అనే ప్రత్యేక నిర్మాణాన్ని ఉపయోగించి, విస్తృత ప్రాంతంలో  ప్రభావాన్ని విభజించేలా రూపొందించారు. తేనెగూడు ఆకృతిని పోలిన ఈ నిర్మాణం దెబ్బ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు.

ఈ రెండు ఉత్పత్తులు ఇప్పటికే పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే అసలు పరీక్ష మాత్రం జూన్‌ 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ సందర్భంగా జరగనుంది. లార్డ్స్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఈ రెండు కంపెనీల ఉత్పత్తులను ఉపయోగించే అవకాశం ఉంది. మైదానంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీపడుతుండగా, మైదానం వెలుపల విలియమ్సన్‌ 'కవర్‌', సాంట్నర్‌ కుటుంబం 'ట్రూగార్డ్‌' మధ్య ఆసక్తికర పోటీ నెలకొననుంది.

ఐపీఎల్‌ 2026లో కేన్‌ విలియమ్సన్‌ లక్నో మెంటార్‌గా వ్యవహరించిన సమయంలో తన ఉత్పత్తిని ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఓ మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌కు బంతి బలంగా బాక్స్‌పై తాకినా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆడటం ఈ ఉత్పత్తికి మంచి ప్రచారం తీసుకొచ్చింది. ఆ ఘటన తర్వాత విలియమ్సన్‌కు మార్ష్‌ థంబ్స్‌అప్‌ చూపించడం కూడా సోషల్‌ మీడియాలో వైరలైంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement