ఏకైక టెస్టు ఆడేందుకు న్యూజిలాండ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా బెల్‌ఫాస్ట్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్ బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది.
టామ్ బ్లండెల్ భారీ సెంచరీ
ఓపెనింగ్ జోడీ.. కెప్టెన్ టామ్ లాథమ్ (0), డెవాన్ కాన్వే (4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ (36) ఫర్వాలేదనిపించాడు. ఇక రచిన్ రవీంద్ర శతక్కొట్టగా (121).. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ భారీ సెంచరీ (186)తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (98) కూడా రాణించాడు.
ఫాలో ఆన్ ఆడుతూ..
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 8 వికెట్లు నష్టపోయి 490 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్.. 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది.
రెండో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసి.. కివీస్ కంటే ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
186 runs, 292 balls, nearly 7 hours at the crease. A new career-best for Tom Blundell in Test cricket 😮💨#IREvNZ pic.twitter.com/LJHkjFjQhF
— BLACKCAPS (@BLACKCAPS) May 28, 2026
యూరోపియన్ గడ్డపై సరికొత్త చరిత్ర
యూరోపియన్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 292 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 186 పరుగులు చేసి.. రూబెన్ విల్సన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఇక ఈ రికార్డు అంతకుముందు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ పేరిట ఉండేది. గతేడాది ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియా మీద అతడు 184 పరుగులు సాధించాడు. బ్లండెల్ తాజాగా అతడిని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
కివీస్ తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ..
అదే విధంగా.. విదేశీ గడ్డ మీద టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌నూ బ్లండెల్ నిలిచాడు. గతంలో వారెన్ లీస్ 152 పరుగులు సాధించగా.. బ్లండెల్ అతడి రికార్డు బ్రేక్ చేశాడు.
ఇక విదేశాల్లో టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన కివీస్ వికెట్ కీపర్ల జాబితాలో బ్రెండన్ మెకల్లమ్ (2 సెంచరీలు)తో కలిసి బ్లండెల్ రెండో స్థానం ఆక్రమించాడు. బీజే వాల్టింగ్ (3 సెంచరీలు) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.


