
ఈ నెలాఖరులో జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జులై 8) ప్రకటించారు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడనుంది. ఇతరత్రా ప్లేయింగ్ కమిట్‌మెంట్స్ కారణంగా కేన్ ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేన్ ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీ కోసమే కేన్ జింబాబ్వే సిరీస్‌ను వద్దనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
జింబాబ్వే సిరీస్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా తప్పుకొన్నాడు. ఫ్రాంచైజీ కమిట్‌మెంట్స్ కారణంగా మైఖేల్ బ్రేస్‌వెల్ జింబాబ్వే సిరీస్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఈ సిరీస్ సమయంలో బ్రేస్‌వెల్ హండ్రెడ్ లీగ్‌లో ఆడాల్సి ఉంది.
స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉన్నందున అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగనుంది.
కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. లెఫ్ట్‌మార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా యువ పేసర్ మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. ఫిషర్ దేశవాలీ క్రికెట్‌లో విశేషంగా రాణించి జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. ఫిషర్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జులై 30 నుంచి న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తొలి టెస్ట్ జులై 30న, రెండో టెస్ట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు బులవాయో వేదికగా జరుగుతాయి.