‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ టికెట్ల రేట్లు ఇలా.. రూ. 199 నుంచి.. | Neeraj Chopra Classic Event Tickets Price Details: Form Rs 199 To 44999 | Sakshi
Sakshi News home page

‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ టికెట్ల రేట్లు ఇలా.. రూ. 199 నుంచి..

May 6 2025 10:59 AM | Updated on May 6 2025 11:04 AM

Neeraj Chopra Classic Event Tickets Price Details: Form Rs 199 To 44999

బెంగళూరు: భారత దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్న ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ జావెలిన్‌ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల విక్రయం ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా పేరిట ఈ నెల 24న నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో నీరజ్‌తో పాటు థామస్‌ రోలెర్‌ (జర్మనీ), అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) వంటి పలువురు అంతర్జాతీయ స్టార్‌ జావెలిన్‌ త్రోయర్లు పాల్గొంటున్నారు. 

ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను ‘డిస్ట్రిక్ట్‌’ యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. టికెట్ల ధర రూ. 199 నుంచి 9,999గా నిర్ణయించారు. రూ. 44,999 ధర గల ఐదు కార్పొరేట్‌ బాక్స్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

మొత్తం స్టేడియంలో 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలో నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ జావెలిన్‌ ఈవెంట్‌ కావడంతో... కర్ణాటక ఒలింపిక్‌ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖ దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయి. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య కూడా దీనికి ‘గోల్డ్‌ ఈవెంట్‌’ స్థాయి కల్పించింది.

ఇవీ చదవండి: కాంస్యం నెగ్గిన పర్వ్‌
లిమా (పెరూ): భారత యువ వెయిట్‌ లిఫ్టర్‌ పర్వ్‌ చౌధరీ ప్రపంచ యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌íÙప్‌లో కాంస్య పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో పర్వ్‌ 315 కేజీల బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 140 కేజీల బరువెత్తిన పర్వ్‌... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మరో 175 కేజీల బరువు ఎత్తాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం.

ఇప్పటికే జ్యోష్న సబర్‌ (40 కేజీల), హర్షవర్ధన్‌ సాహూ (49 కేజీలు) కాంస్యాలు గెలుచుకోగా... ఇప్పుడు పర్వ్‌ ఆ సంఖ్యను మూడుకు పెంచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌ లిఫ్టింగ్‌తో పాటు స్నాచ్, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో వేర్వేరుగా పతకాలు ఇస్తారు. 

సినెర్‌ పునరాగమనం
రోమ్‌: ప్రపంచ  నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)పై విధించిన నిషేధం పూర్తయింది. దీంతో స్వదేశంలో జరగనున్న ఇటాలియన్‌ ఓపెన్‌ ద్వారా సినెర్‌ పునరాగమనం చేయనున్నాడు. ఈ టోర్నీలో ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు పాల్గొననుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో సినెర్‌కు ‘బై’ దక్కగా... శుక్రవారం జరగనున్న రెండో రౌండ్‌లో సినెర్‌ ఆడనున్నాడు.

వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఎజెన్సీ (వాడా) సినెర్‌పై విధించిన నిషేధం సోమవారంతో ముగియగా... ఈ ఇటలీ ఆటగాడు ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. తమ అభిమాన ఆటగాడి సాధన చూసేందుకు వేలాదిగా ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన అనంతరం సినెర్‌ కోర్టులో అడుగు పెట్టలేదు. ఈ నెల 25 నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఇటాలియన్‌ ఓపెన్‌ సినెర్‌కు మంచి ప్రాక్టీస్‌ కానుంది. ఇటాలియన్‌ ఓపెన్‌లో చివరిసారిగా 1976లో ఇటలీకి చెందిన అడ్రియానో పనట్టా విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ఇటలీ ప్లేయర్లు ఎవరూ ఇటాలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గలేదు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement