ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు మాజీ విజేత దూరం  

Naomi Osaka Withdraws From Australian Open - Sakshi

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు మరో దెబ్బ పడింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, 2022 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)... మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) వైదొలగగా.. ఈ జాబితాలో తాజాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా చేరింది.

జపాన్‌కు చెందిన 25 ఏళ్ల ఒసాకా ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగడంలేదని నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. అయితే ఒసాకా వైదొలగడానికి కారణం మాత్రం వారు వెల్లడించలేదు. 2019, 2021లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన ఒసాకా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఏ టోర్నీలోనూ ఆడలేదు. ప్రస్తుతం ఆమె 42వ ర్యాంక్‌కు పడిపోయింది.

2018, 2020 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన ఒసాకా 2021 ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్యలో వైదొలిగింది. ఆ తర్వాత తాను మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నానని తెలిపి రెండునెలలపాటు ఆట నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత పలు టోర్నీలలో ఆమె బరిలోకి దిగినా టైటిల్‌ మాత్రం సాధించలేకపోయింది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top