ఐపీఎల్‌ నిరాకరణ తర్వాత పీఎస్‌ఎల్‌లో చరిత్ర | Mustafizur Rahman Scripts History In Pakistan After IPL Ignorance | Sakshi
Sakshi News home page

Mustafizur Rahman: ఐపీఎల్‌ నిరాకరణ తర్వాత పీఎస్‌ఎల్‌లో చరిత్ర

Apr 10 2026 3:17 PM | Updated on Apr 10 2026 3:34 PM

Mustafizur Rahman Scripts History In Pakistan After IPL Ignorance

బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ IPL 2026లో చోటు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాయాది లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ లాహోర్‌ ఖలందర్స్‌కు ఆడుతున్న ముస్తాఫిజుర్‌.. నిన్న (ఏప్రిల్‌ 9) ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 డాట్‌ బాల్స్‌ వేయడంతో పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన 3000 డాట్‌ బాల్స్‌ మైలురాయిని అధిగమించాడు. 

తద్వారా పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్‌కు ముందు డ్వేన్‌ బ్రావో (3681), మొహమ్మద్‌ ఆమిర్‌ (3348), ఆండ్రీ రస్సెల్ (3213), సోహైల్‌ తన్వీర్‌ (3046) మాత్రమే ఈ ఘనత సాధించారు.

ముస్తాఫిజుర్‌ 3000 డాట్‌ బాల్స్‌ మైలురాయిని తాకిన మ్యాచ్‌లో అతని జట్టు లాహోర్‌ ఖలందర్స్‌ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఖలందర్స్‌ను కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను ఇస్లామాబాద్‌ 10.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతుపాడుతూ ఛేదించింది. డెవాన్‌ కాన్వే (59) అజేయ అర్ద సెంచరీతో ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఇదిలా ఉంటే, ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి అత్యంత సున్నితమైన పరిణామాల మధ్య తొలగించారు. 2026 సీజన్‌ కోసం​ జరిగిన వేలంలో అతన్ని కేకేఆర్‌ రూ. 9.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోగా.. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జియో పొలిటిలక్‌‌ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అతని ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దీంతో ముస్తాఫిజుర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement