Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. శనివారం చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓడినప్పటికీ ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డును నమోదు చేయడం విశేషం.
టీ20 క్రికెట్ చరిత్రలో 50 వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఈ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 50వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి ముంబై ఇండియన్స్‌కు 114 పరుగులు అవసరం కాగా.. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఆ మైలురాయిని అందుకుంది. ముంబై ఇండియన్స్‌కు ఇది 308వ టీ20 మ్యాచ్.
ఇందులో 286 ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా.. మరో 22 మ్యాచ్‌లు ఛాంపియన్స్ లీగ్‌వి ఉన్నాయి. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్ (48,244 పరుగులు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (47,304 పరుగులు), చెన్నై సూపర్ కింగ్స్ (46,438 పరుగులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రోహిత్ శర్మ (6,286 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (3,933), కీరన్ పొలార్డ్ (3,915) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచ రికార్డు సాధించినప్పటికీ మ్యాచ్ ఫలితం మాత్రం ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం మిగిల్చింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57) అర్థసెంచరీతో రాణించాడు. రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తిక్ శర్మ (54 నాటౌట్) సీఎస్‌కేను గెలిపించారు. సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఏడో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్‌కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.


