ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ధోని!

MS Dhoni Shares Letter of Appreciation from PM Modi and Thanked Him - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఆగస్టు 15న రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు ధోని అందించిన సేవలను ప్రశంసిస్తూ ప్రధానమం‍త్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగ సందేశాన్ని మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ధోని ‘ఆర్టిస్ట్, సైనికుడు, స్పోర్ట్స్ పర్సన్ ఇలా ప్రతి ఒక్కరు కోరుకునేది వారి కృషికి తగ్గ  గుర్తింపు, ప్రశంసలు. అప్పుడే వారి కృషి, త్యాగం అందరిచేత గుర్తించబడుతుంది. ధన్యవాదాలు మోదీ జీ’ అని ధోని ట్విటర్‌ వేదికగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మోదీ అభినందించిన లేఖను ‍ట్విటర్‌ వేదికగా ధోని అభిమానులతో పంచుకున్నారు.     

క్రికెట్ మైదానంలో ధోని సాధించిన విజయాలను, అతడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను మోదీ ప్రశంసించారు. క్రికెట్‌ చరిత్రలో ఉత్తమ సారథిగా ధోని నిలిచిపోతారని కితాబిచ్చారు. ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో 130 కోట్ల మంది భారతీయులు నిరాశ చెందారని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత క్రికెట్ కోసం సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోని నిలిచిపోతారని, తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా 2009లో భారత జట్టును టెస్టుల్లో నంబర్‌వన్‌గా‌ నిలిపారని ప్రశంసించారు. భారత సైనికులతో ధోని కలిసి పనిచేసిన విషయాన్ని కూడా మోదీ గుర్తు చేశారు. 

చదవండి: ధోని ఫేర్‌వెల్‌ సాంగ్‌ వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top