
PC: LAK X
మేజర్ లీగ్ క్రికెట్-2025 మ్యాచ్‌లో ఉన్ముక్త్ చాంద్ దంచికొట్టాడు. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అమెరికా టీ20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్‌లో భాగంగా డల్లాస్ వేదికగా సీటెల్ ఒర్కాస్- లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య సోమవారం తెల్లవారుజామున మ్యాచ్ జరిగింది.
టాస్ గెలిచిన సీటెల్ జట్టు కెప్టెన్ హెన్రిచ్ క్లాసెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు షయాన్ జహంగీర్ (15 బంతుల్లో 26), డేవిడ్ వార్నర్ (28 బంతుల్లో 38).. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ (36 బంతుల్లో 44) రాణించారు.
కెప్టెన్ క్లాసెన్ మాత్రం 4 పరుగులకే పరిమితం కాగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మెయిర్ 19 పరుగులు చేయగా.. సికందర్ రజా 16 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీటెల్ ఒర్కాస్ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు కూల్చగా.. కార్నీ డ్రై, వాన్ షాల్‌విక్, కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (1) ఎదుర్కొన్న నాలుగో బంతికే వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ నితీశ్ కుమార్ (1) కూడా నిరాశపరిచాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఉన్ముక్త్ చాంద్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 86 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ సైఫ్ బాదర్ (32 బంతుల్లో 54) అర్ధ శతకంతో రాణించాడు.
చివర్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ 9 బంతుల్లో 20 రన్స్‌తో మెరుపులు మెరిపించాడు. ఉన్ముక్త్‌తో కలిసి అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ సీటెల్ ఒర్కాస్‌పై జయభేరి మోగించింది.
కాగా ఈ సీజన్‌లో ఉన్ముక్త్ చాంద్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో కలిపి 161 పరుగులతో దుమ్ములేపాడు. ఇక 2012లో ఉన్ముక్త్ చాంద్ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే.
భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన ఘనుడు
అయితే, ఆ తర్వాత అతడికి అవకాశాలు రాలేదు. టీమిండియాలో చోటు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఉన్ముక్త్ చాంద్ తన కల నెరవేరకపోవడంతో అమెరికాకు వలస వెళ్లిపోయాడు. అక్కడే క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉంటే.. జూన్ 12న మొదలైన మేజర్ లీగ్ క్రికెట్-2025 లీగ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, సీటెల్ ఒర్కాస్ టైటిల్ కోసం తలపడుతున్నాయి. నాలుగింట నాలుగు విజయాలతో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు.. లాస్ ఏంజెల్స్‌కు ఇదే తొలి విజయం కాగా.. సీటెల్ జట్టు ఇంకా ఖాతా తెరవనేలేదు.