అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్‌ అంటున్న బాలీవుడ్‌ స్టార్‌! ఎందుకంటే.. | Sakshi
Sakshi News home page

Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్‌ అంటున్న బాలీవుడ్‌ స్టార్‌! ఎందుకంటే..

Published Tue, Oct 31 2023 8:20 PM

Master Of Chasing Suniel Shetty Picks Kohli As Favourite Cricketer Over KL Rahul - Sakshi

Virat Kohli- ICC WC 2023: టీమిండియా స్టార్‌, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 78 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రికార్డుల రారాజు ఆట అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా ఛేజింగ్‌లో కింగ్‌లా కోహ్లి పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు ఫ్యాన్స్‌. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నాడు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి. ఫేవరెట్‌ క్రికెటర్‌గా అల్లుడిని కాదని.. విరాట్‌ కోహ్లికే ఓటు వేశాడు.

అయితే.. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు. కాగా కర్ణాటకకు చెందిన సునిల్‌ శెట్టి బాలీవుడ్‌లో నటుడిగా నిలదొక్కుకున్నాడు. బల్వాన్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. దిల్‌వాలే, బార్డర్‌, భాయ్‌, ఆఘాజ్‌ వంటి చిత్రాల్లో నటించాడు.

ముంబైలో స్థిరపడ్డ సునిల్‌
ఈ క్రమంలో ముంబైలో సెటిల్‌ అయిన సునిల్‌ శెట్టి తన 30 ఏళ్ల కెరీర్‌లో వందకు పైగా సినిమాల్లో నటించాడు. వ్యాపారవేత్తగానూ కొనసాగుతున్న ఈ వెటరన్‌ యాక్టర్‌ మనా శెట్టిని వివాహమాడగా.. వీరికి కూతురు అతియా శెట్టి, కుమారుడు అహాన్‌ శెట్టి జన్మించారు.

వీరిద్దరు నటులుగా తమ ప్రతిభను నిరూపించుకునే పనిలో ఉన్నారు. అయితే, సునిల్‌ గారాల పట్టి అతియా శెట్టి హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో టీమిండియా స్టార్‌, కర్ణాటక బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌తో ప్రేమలో పడింది. 

సునిల్‌కు అల్లుడిగా స్టార్‌ క్రికెటర్‌
ఇరు కుటుంబాల అంగీకారంతో రాహుల్‌-అతియా ఈ ఏడాది వివాహ బంధంలో అడుగుపెట్టారు. సునిల్‌ శెట్టికి చెందిన ఫామ్‌హౌజ్‌లో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి వేడుక జరిగింది. కాగా సునిల్‌.. రాహుల్‌ను అల్లుడిలా కాకుండా కొడుకుగా చూసుకుంటాడని ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపితమైంది.

రాహుల్‌ కుమారుడు కదా!
ఈ క్రమంలో తాజాగా మనీకంట్రోల్‌ సమ్మిట్‌లో మాట్లాడిన సునిల్‌ శెట్టి తన అభిమాన క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లి పేరు చెప్తూనే.. రాహుల్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే కచ్చితంగా విరాట్‌ కోహ్లి పేరే చెప్తాను. కేఎల్‌ రాహుల్‌ నా కుమారుడు.

నా కుటుంబ సభ్యుడి గురించి నేను పొగిడితే బాగుండదు కదా! నిజానికి నేను జాతీయ జట్టుకు ఆడాలనుకున్నాను. నా అల్లుడి రూపంలో  ఆ కోరిక నెరవేరింది. ఏదేమైనా.. ఛేజింగ్‌ మాస్టర్‌ కాబట్టే కోహ్లి నా అభిమాన క్రికెటర్‌ అయ్యాడు’’ అని సునిల్‌ శెట్టి చెప్పుకొచ్చాడు.

కాగా ప్రపంచకప్‌-2023 ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి(85), రాహుల్‌(97- నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగానే టీమిండియా ఆస్ట్రేలియాపై గెలుపొందిన విషయం తెలిసిందే. అదే విధంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లి తన అంతర్జాతీయ కెరీర్‌లో 78వ సెంచరీ చేసేందుకు రాహుల్‌ సహకారం అందించి ఫ్యాన్స్‌ మనసులు గెలుచుకున్నాడు.

చదవండి: WC 2023: అయ్యో.. ఇదేంటి ఇలా అయిపోయింది?.. రోహిత్‌ శర్మ పోస్ట్‌ వైరల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement