
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ దేశవాలీ టీ20 టోర్నీలో చెలరేగిపోయాడు. అతను చెలరేగింది బ్యాట్‌తోకాదు. నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా అయిన అతను..బ్రిస్బేన్‌లో జరిగిన కేఎఫ్‌సీ మ్యాక్స్ టీ20 టోర్నీలో బంతితో రఫ్ఫాడించాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి తన జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
Marnus Labuschagne took a a hattrick in the KFC T20 Max Final. 🤯pic.twitter.com/8ye7U7udVu
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025
ఈ టోర్నీలో రెడ్‌ల్యాండ్స్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లబూషేన్.. వ్యాలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్ బౌలర్‌గా మాత్రమే కాకుండా ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 3 క్యాచ్‌లు పట్టుకుని రెడ్‌ల్యాండ్స్ గెలుపుకు మరో రకంగానూ దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్ బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్‌ల్యాండ్స్.. జిమ్మీ పీర్సన్ (50 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సులు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వ్యాలీ జట్టు 150 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
లబుషేన్ చివర్లో వరుసగా మూడు వికెట్లు తీసి రెడ్‌ల్యాండ్స్ విజయం ఖాయం చేశాడు. వ్యాలీ తరఫున మాక్స్ బ్రయంట్ 76 (38 బంతులు) పరుగులతో పోరాడినా, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ టోర్నీ మహిళల విభాగంలో విన్నమ్-మాన్లీ జట్టు టైటిల్ గెలిచింది.
కాగా, పేలవ ఫామ్ కారణంగా లబూషేన్ కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. ప్రస్తుతం అతను యాషెస్ సిరీస్ కోసం జట్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.