source: X
స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఘనంగా బోణీ కొట్టింది. లీసెస్టర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య టీమ్ 6 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 71 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సొంతం చేసుకుంది. వన్డేల్లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. 2023లో ఆస్ట్రేలియాపై 267 పరుగుల లక్ష్య ఛేదన ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు అత్యుత్తమంగా ఉండేది.
ఈ రికార్డు ఛేదనకు ఓపెనర్ మాయా బౌచియర్ ప్రధాన కారణంగా నిలిచింది. బౌచియర్ సూపర్ సెంచరీతో (95 బంతుల్లో 104) తన జట్టుకు రికార్డు విజయాన్నందించింది. బౌచియర్‌కు మరో ఓపెనర్ సోఫియా డంక్లీ (73) సహకారం అందించింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా ఇంగ్లండ్ జోరు తగ్గలేదు. ఆలిస్ క్యాప్సీ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఫ్రెయా కెంప్ 22 బంతుల్లో 36 పరుగులు చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అమీ హంటర్ (62), కెప్టెన్ గాబీ లూయిస్ (69), రెబెక్కా స్టోకెల్ (54 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కాగా, ఈ సిరీస్‌లోని రెండో వన్డే సెప్టెంబర్ 3న డెర్బీలో జరగనుంది.
చదవండి: థాయ్‌లాండ్ నిష్క్రమణ


