మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–1000 టోర్నీల్లో ఇప్పటి వరకు చోటు చేసుకోని అద్భుతం మాడ్రిడ్ ఓపెన్‌లో నిజమైంది. ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ఆస్ట్రియా ప్లేయర్ అనస్తాసియా పొటపోవా ఏకంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
తద్వారా 1990 నుంచి జరుగుతోన్న డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీల్లో సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్న తొలి ‘లక్కీ లూజర్’గా పొటపోవా గుర్తింపు పొందింది.
మాడ్రిడ్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 56వ ర్యాంకర్ పొటపోవా 6–1, 6–7 (4/7), 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2016 యూఎస్ ఓపెన్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై సంచలన విజయం సాధించింది.
‘లక్కీ లూజర్’ ఎవరంటే...
ఏదైనా టోర్నీ మెయిన్ ‘డ్రా’ ఖరారయ్యాక అందులోని ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలుగుతారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు ‘లక్కీ లూజర్స్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పిస్తారు.
మాడ్రిడ్ ఓపెన్‌లో పొటపోవాకు ఈ అనుభవమే ఎదురైంది. రష్యాలో జన్మించి ప్రస్తుతం ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొటపోవా ఈ టోర్నీ సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లో ఓడిపోయింది. ఫలితంగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.
అయితే మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన నలుగురు ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌లలో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు.
పొటపోవాతోపాటు పన్నా ఉడ్వార్డి (హంగేరి), అన్నా బ్లింకోవా (రష్యా), యులియా (ఉక్రెయిన్)లకు ‘లక్కీ లూజర్స్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు కల్పించారు. ఉడ్వార్డి, బ్లింకోవా రెండో రౌండ్‌లో ఓడిపోగా... యులియా తొలి రౌండ్‌లో వెనుదిరిగింది. పొటపోవా మాత్రం ఒక్కో రౌండ్‌ను దాటుకుంటూ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.


