IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’ | Let people talk not here to prove my talent: Ajinkya Rahane shuts critics | Sakshi
Sakshi News home page

ఎవరు ఏమనుకుంటే నాకేంటి?.. ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను

Mar 31 2026 3:25 PM | Updated on Mar 31 2026 3:46 PM

Let people talk not here to prove my talent: Ajinkya Rahane shuts critics

PC: BCCI

తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్‌, ప్రస్తుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తాను క్రికెట్‌ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. 

ఆటగాడిగానే
తన భవిష్యత్తుపై, రిటైర్మెంట్‌పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్‌ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 

20 ఏళ్లుగా అదే పని 
ముంబైతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తాను. 

వాళ్లనలా చూడనివ్వండి
నా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. 

వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్‌’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. 

ఓ క్రికెటర్‌గా, బ్యాటర్‌గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.

మా ఓటమికి కారణం అదే
‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్‌ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.

అనుభవలేమి బౌలింగ్‌ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్‌ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్‌ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. 

చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌  

Advertisement
 
Advertisement
Advertisement