భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. సమాచార హక్కు చట్టం (RTIA) పరిధి నుంచి బోర్డును తొలగిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (CIC) తీర్పు వెలువరించింది. బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కాదని స్పష్టం చేసింది.
గతంలో అలా..
కాగా 2018లో సమాచార కమిషనర్‌గా ఉన్న ఎం. శ్రీధర్ ఆచార్యులు.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h)ను అనుసరించి బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా డిక్లేర్ చేశారు. బోర్డులో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మద్రాస్ హైకోర్డును ఆశ్రయించగా.. CIC వద్దకు చేరింది.
ప్రభుత్వ నియంత్రణలో లేదు
గీతా రాణి అనే వ్యక్తి గతంలో బీసీసీఐ విషయంలో వేసిన పిటిషన్‌ను తాజాగా కొట్టివేస్తూ.. ‘‘చట్టపరమైన తీర్పులు గానీ.. శాసనాల ద్వారా రాతపూర్వకంగా జరిగిన చట్టంగా మారినట్లుగా గానీ.. బీసీసీఐ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా ప్రభుత్వానికి చెందినట్లుగా లేదంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా పొందడం లేదు’’ అని CIC తన తీర్పులో పేర్కొంది.
ప్రభుత్వ ఫండింగ్‌గా భావించకూడదు
బీసీసీఐ ఆర్థికంగా స్వతంత్ర వ్యవస్థ అని.. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిపులు, ఐపీఎల్ ఒప్పందాలు, టికెట్ల అమ్మకాలు.. తదితరాల నుంచి ఆదాయం పొందుతోందని CIC ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు పొందుతోంది కాబట్టి.. దీనిని ప్రభుత్వ ఫండింగ్‌గా భావించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేసింది.
అదే విధంగా.. క్రికెట్ పరిపాలనా అంశాలకు సంబంధించి అంతా పారదర్శకంగా ఉండాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని CIC పేర్కొంది. అంతేతప్ప.. ఆర్టీఐ చట్టం కింద బీసీసీఐని ఎన్నడూ పబ్లిక్ అథారిటీగా ప్రకటించలేదని స్పష్టం చేసింది.
ప్రైవేటు సంస్థగా
కాగా తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ప్రైవేటు సంస్థగా బీసీసీఐ నమోదైంది. పార్లమెంట్ ద్వారా చేయబడిన చట్టం లేదంటే రాజ్యంగబద్ధంగా బోర్డు రూపొందలేదు. కాగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఐపీఎల్ ఎక్కువైందా?.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్


