తల్లిదండ్రులు ఇద్దరూ క్రీడాకారులే. తండ్రి జయశంకర్ భారత పురుషుల బాస్కెట్‌బాల్ జట్టుకు కెప్టెన్ అయితే.. తల్లి ప్రసన్న భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టుకు సారథి. ఆ తర్వాత ఇద్దరూ కోచ్‌లుగా మారి ఆటతో ప్రయాణం కొనసాగించారు.
అలా ఆ అమ్మాయికి చిన్ననాటి నుంచే క్రీడా వాతావరణం అలవాటైపోయింది. అయితే, తల్లిదండ్రుల్లా ఆమె బాస్కెట్‌బాల్‌ను ఎంచుకోలేదు. అందుకు బదులు ‘షాట్‌పుట్’ ఆమెను ఎంచుకుంది. ఆ అమ్మాయి పేరు క్రిష్ణా జయశంకర్ మీనన్. ఇండోర్ షాట్‌పుట్‌లో 17 మీటర్ల మార్కు దాటిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా ఆమె ఇటీవలే చరిత్ర సృష్టించింది.
ఒలింపిక్స్ లక్ష్యంగా..
అంతేకాదు.. అమెరికాలో NCAA డివిజన్ 1 స్కాలర్‌షిప్ పొందిన ఏకైక భారత మహిళా షాట్‌పుటర్‌గానూ క్రిష్ణ రికార్డు సాధించింది. తదుపరి అవుట్‌డోర్ సీజన్‌పై దృష్టి పెట్టిన ఈ తమిళనాడు అథ్లెట్.. కామన్‌వెల్త్, ఆసియా క్రీడలు.. ఆపై లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్
క్రీడా కుటుంబంలో జన్మించినప్పటికీ క్రిష్ణ ప్రయాణం అంత సజావుగా ఏమీ సాగలేదు. తన ‘కండబలం’ చూసి అందరూ హేళన చేస్తుంటే.. తాను మహిళా అథ్లెట్‌కు నిజమైన ప్రతినిధిని కాదేమోనంటూ కుంగిపోయేది క్రిష్ణ. అలా ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె.. ఎనిమిది సార్లు జాతీయ సెలక్షన్స్‌లో విఫలమైంది.
నిజానికి షాట్‌పుట్ శిక్షణ కారణంగానే ఆమె దేహం కండలు తిరిగింది. త్రోయింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ‘లావుగా.. మొరటుగా’ ఉన్నావంటూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంది. తనలో ఆడతనం కనిపించడం లేదంటూ కొంతమంది హద్దుదాటి మరీ కామెంట్ చేసేవారు.
ఈ ప్రభావం క్రిష్ణ ఆట తీరుపై పడింది. అయితే, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడింది. తనను గేలి చేసిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంది. అప్పటి నుంచి కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెట్టిన క్రిష్ణ.. ఇప్పుడు సరికొత్త రికార్డు నెలకొల్పింది.
జమైకాలో ఇలాగే ఉంటారు
కోవిడ్ సమయంలో క్రిష్ణ శిక్షణ కోసం ఇండియాను వీడి జమైకాకు వెళ్లింది. అక్కడ తనలాగా ఉండే కండలు తిరిగిన ఆడ అథ్లెట్ల విజయాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అక్కడ అచ్చంగా తన లాంటి శరీరాకృతితో ఉన్న అథ్లెట్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫలితంగానే ఇప్పుడు ఈ రికార్డు విజయం ఆమె సొంతమైంది.
త్యాగాల ఫలితం
క్రిష్ణ తల్లిదండ్రులది కేరళ. అయితే, బాస్కెట్‌బాల్ కోసం వాళ్లు తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కెప్టెన్ స్థాయికి ఎదిగారు. క్రిష్ణ కూడా చిన్ననాటి నుంచే షాట్‌పుట్‌పై దృష్టి సారించింది.
కఠినమైన శిక్షణ, ఆటను మరింత మెరుగుపరచుకోవడం కోసం విదేశాలకు వెళ్లింది. చాలాకాలం పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నగానే కనబడ్డాయి. తన సోదరి నిశ్చితార్థ సమయంలోనూ క్రిష్ణ ప్రాక్టీస్ కోసం విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
అయినా.. కెరీర్ కోసం ఇలాంటి త్యాగాలు తప్పవని మొండిగా ముందుకు సాగింది. 23 ఏళ్ల వయసులోనే సరికొత్త చరిత్ర సృష్టించి.. ఒలింపిక్స్ పతకం గెలవడమే లక్ష్యంగా తన ప్రయాణం కొనసాగిస్తున్న క్రిష్ణ యువతకు ఆదర్శం.


