మహిళల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీకి కోనేరు హంపి, హారిక అర్హత

Koneru Humpy, Harika Dronavalli to lead Indian challenge at Womens Chess World Cup 2021 - Sakshi

చెన్నై: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు భారత స్టార్‌ క్రీడాకారిణులు, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అర్హత సాధించారు. ఈ ఇద్దరితోపాటు పద్మిని రౌత్, భక్తి కులకర్ణి భారత్‌ తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ ర్యాంకింగ్, రేటింగ్‌ ప్రకారం హంపి, హారిక బెర్త్‌లు దక్కించుకోగా... ఆసియా జోనల్‌ కోటా ద్వారా పద్మిని, భక్తి అర్హత పొందారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం హంపి మూడో ర్యాంక్‌లో, హారిక తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా టోర్నీ జూలై 10 నుంచి ఆగస్టు 3 వరకు రష్యాలోని సోచి నగరంలో జరగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణుల జాబితాను ‘ఫిడే’ విడుదల చేసింది. నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం ఏడు రౌండ్‌లు ఉంటాయి. ప్రతి రౌండ్‌లో రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఒకవేళ ఇద్దరి మధ్య స్కోర్లు సమం గా నిలిస్తే టైబ్రేక్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top