టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడని తెలిపాడు. ఇక తండ్రిగా ప్రమోషన్ పొందిన తర్వాత విరాట్ తన దూకుడు స్వభావానికి విరుద్ధంగా పూర్తిగా నెమ్మదస్తుడైపోయాడని వెల్లడించాడు.
పెళ్లైన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోయాడు
యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో కైఫ్‌నకు కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. విరాట్ కోహ్లి మారిపోయాడు. ఇప్పుడు కాస్త నెమ్మదస్తుడు అయ్యాడు. అతడు ఒక తండ్రి.
పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత కోహ్లిలో చాలా మార్పు వచ్చింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇటీవల అతడిని కలిశాను. ఇద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం.
కగిసో రబడ బౌలింగ్‌లో ఆరోజు కోహ్లి ఫోర్ బాదాడు. ఆ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. నిజంగా కోహ్లి చాలా కామ్‌గా ఉన్నాడు. ఒకవేళ తాను ముందుగానే రబడపై బ్యాట్‌తో విరుచుకుపడకపోతే.. అతడు తనను పరుగులు రాబట్టనివ్వడని చెప్పాడు.
అందుకే తొలి బంతి నుంచే అటాకింగ్ మొదలుపెట్టానని అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ఇలాగే ఆడుతున్నాడు. కోహ్లి అద్భుతమైన క్రికెటర్. రోజురోజుకీ తన ఆటను మెరుగుపరచుకుంటున్నాడు. హడావుడి లేకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
అప్పుడు అన్నా అంటే..
ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవం, రికార్డుల తర్వాత కూడా తను నాతో వ్యవహరించే విధానంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అపుడు నన్ను అన్నా అని పిలిస్తే.. ఇప్పుడు కూడా అలాగే పిలుస్తున్నాడు. తనతో కలిసి ఆడిన వాళ్లకు తగిన గౌరవం ఇస్తాడు.
ఎంత ఎదిగినా ఇతరులతో వ్యవహరించే తీరులో మాత్రం అతడు మారలేదు. అయితే, మునుపటి కంటే కాస్త నెమ్మదస్తుడు అయ్యాడని చెప్తాను’’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ముచ్చటైన కుటుంబం
కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017, డిసెంబరు 11న ఆమెను పెళ్లాడాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. గోప్యత దృష్ట్యా ఇంతవరకు తమ పిల్లల ముఖాలను విరుష్క జోడీ బయటి ప్రపంచానికి చూపించనేలేదు. వీరు ప్రస్తుతం లండన్‌లోనే ఎక్కువగా నివాసం ఉంటున్నారు.
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన కింగ్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) బాది ఫామ్‌లోకి వచ్చాడు. తదుపరి సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌తో కోహ్లి రీఎంట్రీ ఇస్తాడు.
చదవండి: ఈ క్రికెటర్‌ని గుర్తుపట్టారా?.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడు ఇలా..


