ఆంటోనెల్లి మళ్లీ... | Kimi Antonelli takes second consecutive win in the latest Formula One season | Sakshi
Sakshi News home page

ఆంటోనెల్లి మళ్లీ...

Mar 30 2026 2:39 AM | Updated on Mar 30 2026 2:39 AM

Kimi Antonelli takes second consecutive win in the latest Formula One season

ఫార్ములావన్‌ సీజన్‌లో వరుసగా రెండో విజయం

జపాన్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌  

సుజుకా: ఇటలీ టీనేజర్‌ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ములావన్‌ సీజన్‌లో వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సీజన్‌ మూడో రోజు జపాన్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టుకు చెందిన 19 ఏళ్ల కిమీ ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌ల రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన ఆంటోనెల్లి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ట్రాక్‌పై దూసుకుపోయాడు. అందరికంటే ముందుగా, అందరికంటే వేగంగా 1 గంట 28 నిమిషాల 03.403 సెకన్లలో 53 ల్యాప్‌లను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఈనెల 15న చైనాలో జరిగిన షాంఘై గ్రాండ్‌ప్రిలోనూ ఆంటోనెల్లి చాంపియన్‌గా నిలిచాడు. తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ జట్టుకే చెందిన జార్జ్‌ రసెల్‌ టైటిల్‌ గెలిచాడు. దాంతో ఈ సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో మెర్సిడెస్‌ డ్రైవర్లే గెలిచి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశారు. జపాన్‌ గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో, జార్జ్‌ రసెల్‌ నాలుగో స్థానంలో నిలిచారు. 

డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్, మెక్‌లారెన్‌ డ్రైవర్‌ నోరిస్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏప్రిల్‌ 12న జరగాల్సిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి, ఏప్రిల్‌ 19న జరగాల్సిన సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిని ఫార్ములావన్‌ నిర్వాహకులు రద్దు చేశారు. తదుపరి రేసు మయామి గ్రాండ్‌ప్రి మే 3వ తేదీన జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement