డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన ఇండోనేసియా ప్లేయర్‌గా జనిస్ జెన్ గుర్తింపు
చెన్నై: అంచనాలకు మించి రాణించిన ఇండోనేసియా క్రీడాకారిణి జనిస్ జెన్ తన కెరీర్‌లో తొలి మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–250 టూర్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఎంజెలిక్ విద్జాజా (2002లో పట్టాయా ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఇండోనేసియా క్రీడాకారిణిగా జనిస్ గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టోర్నీలో ప్రపంచ 82వ ర్యాంకర్ జనిస్ జెన్ విజేతగా అవతరించింది.
రెండు గంటలపాటు జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ జనిస్ జెన్ 6–3, 6–4తో ఏడో సీడ్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా)పై నెగ్గింది. విజేతగా నిలిచిన జనిస్ జెన్‌కు 36,300 డాలర్ల (రూ. 32 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్‌లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


