
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జైసూ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడని పేర్కొన్నాడు. అయితే, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం సరికాదంటూ యాజమాన్యం తీరును విమర్శించాడు.
టెస్టులలో దుమ్ములేపుతున్న జైసూ
భారత టెస్టు జట్టు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ తన స్థానం సుస్థిరం చేసుకున్న విషయం తెలిసిందే. అరంగేట్రం నుంచే శతకాలు, ద్విశతకాలతో దుమ్ములేపుతున్న ఈ ముంబై బ్యాటర్.. ఇప్పటి వరకు 24 టెస్టుల్లో కలిపి 2209 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఆరు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
వన్డే, టీ20లలో మా త్రం నో ఛాన్స్
ఇలా సంప్రదాయ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్న జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తగినన్ని అవకాశాలు రావడం లేదు. టీమిండియా తరఫున 23 టీ20లలో 723 పరుగులు చేసిన జైస్వాల్.. ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే ఆడి 15 పరుగులు రాబట్టగలిగాడు. టీ20లలో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా శుబ్‌మన్ గిల్ ఉండటంతో జైసూకు నిరాశ తప్పడం లేదు.
అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్
ఈ విషయాల గురించి కామెంటేటర్, మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. యశస్వి జైస్వాల్‌ను మూడు ఫార్మాట్లలో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ‘‘యశస్వి మంచి ఆటగాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఆడగలడు. కానీ ఇప్పుడు అతడు కేవలం ఒకే ఫార్మాట్లో ఆడిస్తున్నారు.
ఇలా చేయడం సరికాదు. అతడికి అన్యాయం చేసినట్లే. యశస్విని తప్పకుండా మూడు ఫార్మాట్లలో ఆడించాలి. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడించడంతో పాటు.. తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ యశస్వికి అవకాశం ఇవ్వాలి. అతడిని ఆసీస్ పర్యటనలో వన్డేల్లో ఆడిస్తారనే అనుకుంటున్నా.
అంతేకాదు.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి యశస్వి కూడా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతాడని నమ్ముతున్నా. దీనిపై నాకు సమాచారం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
ఆసియా కప్ ముగించుకున్న తర్వాత
కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. ఈ మెగా టోర్నీ ఆడే జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.
మరోవైపు.. పొట్టి ఫార్మాట్లో సూపర్ ఫామ్‌లో ఉన్నా.. శ్రేయస్ అయ్యర్‌కు కనీసం రిజర్వు ప్లేయర్‌గానూ స్థానం దక్కలేదు. ఇక ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.