ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్‌లో గ్రీన్‌జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్‌సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది.
ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్‌లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్‌లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
అచ్చిరాని జెర్సీ..
అయితే ఆర్‌సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్‌లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గ్రీన్‌జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.
2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్‌లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో కీలకమైన 27 పరుగులు చేశాడు.
గ్రీన్‌జెర్సీతో ఆర్సీబీ విజయాలు..
ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్‌తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్‌గా నిలిచాడు.
2016 సీజన్లో గుజరాత్ లయన్స్‌పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.
2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
2023 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్‌వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.
గత సీజన్‌లోనూ రాజస్తాన్ రాయల్స్‌తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.
𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚
More than a tradition. A purpose we wear with pride. 🙌
Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026


