కేకేఆర్‌ను మోసం చేసిన గ్రీన్‌?.. రీఫండ్‌ చెల్లించాల్సిందే! | Ajinkya Rahane Remark On Cameron Green Bowling Triggers Debate With Cricket Australia After ₹25.20 Crore IPL Deal, Read Story Inside | Sakshi
Sakshi News home page

తెలివిగా కేకేఆర్‌ను మోసం చేసిన గ్రీన్‌!.. రీఫండ్‌ చెల్లించాల్సిందే!

Mar 31 2026 1:03 PM | Updated on Mar 31 2026 1:42 PM

IPL 2026 KKR Should Be Eligible For A Refund: Green In The Spotlight

భారత క్రికెట్‌ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్‌ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అయితే, ఊహించని రీతిలో కేకేఆర్‌కు షాక్‌ తగిలింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తొలుత ముంబై ఇండియన్స్‌తో తలపడగా.. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ బౌలింగ్‌ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్‌ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.

క్రికెట్‌ ఆస్ట్రేలియానే అడగండి
‘ఆ విషయం ఏదో క్రికెట్‌ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్‌లో కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green) బౌలింగ్‌ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్‌ టీమ్‌ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 

10–12 రోజుల్లో 
దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్‌ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్‌ చేయవచ్చు. 

ఈ విషయం కేకేఆర్‌ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్‌రౌండర్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం కోల్‌కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు, మ్యాచ్‌ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్‌ బౌలింగ్‌ చేశాడు. 

కానీ మ్యాచ్‌లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌లో అన్ని మ్యాచ్‌లూ కలిపి గ్రీన్‌ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్‌కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది.  

రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?
నిజానికి తాజా పరిస్థితికి నైట్‌రైడర్స్‌ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్‌ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్‌లో కేవలం ‘బ్యాటర్‌’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. 

ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్‌ పొరపాటు అని, బౌలింగ్‌ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్‌రౌండర్‌’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. 

ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్‌ ఒక పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్‌ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్‌’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. 

వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లి
సహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్‌’ జాబితాలో వచ్చిన గ్రీన్‌ కోసం కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్‌ బౌలింగ్‌ గురించి టీమ్‌కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్‌లో వేలం జరగ్గా...  అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్‌ 2025 వరకు గాయంతో గ్రీన్‌ బౌలింగ్‌ చేయలేదు. 

టీ20ల్లో బ్యాటర్‌గా గ్రీన్‌ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్‌ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్‌ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్‌ కేవలం అతని బ్యాటింగ్‌ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! 

విఫల సమర్థన
ఇప్పుడేమో బౌలింగ్‌ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్‌ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్‌ కోసం వెంకటేశ్‌ అయ్యర్‌కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. 

ఆ సీజన్‌లో అతను అన్ని మ్యాచ్‌లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్‌ ఒక్క బంతి కూడా బౌల్‌ చేయలేదు!    

రీఫండ్‌ చెల్లించాల్సిందే!
ఇదిలా ఉంటే.. గ్రీన్‌ విషయంలో భారత మాజీ క్రికెటర్‌, కేకేఆర్‌ మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా కోల్‌కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్‌రౌండర్‌గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్‌ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్‌ చేశాడు. 

అయితే, అతడి పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్‌ కేకేఆర్‌ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్‌ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. 

చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement