IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌ | IPL 2026, CSK VS RR: Sarfaraz Khan Walks With Illegal Bat On CSK Debut | Sakshi
Sakshi News home page

IPL 2026: నిషేధిత బ్యాట్‌తో దొరికిపోయిన సర్ఫరాజ్‌ ఖాన్‌

Mar 30 2026 10:09 PM | Updated on Mar 30 2026 10:09 PM

IPL 2026, CSK VS RR: Sarfaraz Khan Walks With Illegal Bat On CSK Debut

సీఎస్‌కే బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫ్రాంచైజీ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ నిషేధిత కొలతలున్న బ్యాట్‌తో బ్యాటింగ్‌కు దిగి, ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అంపైర్‌ చేతికి చిక్కాడు.  

ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగగా.. ఫీల్డ్‌ అంపైర్‌కు అతని బ్యాట్‌పై అనుమానం వచ్చి కొలతలు చెక్‌ చేశాడు. 2025 నుంచి అమల్లో ఉన్న నియమాల ప్రకారం బ్యాట్‌ ఎడ్జ్‌ మందం 4 సెంటి మీటర్లు (1.56 అంగుళాలు) దాటకూడదు. అలాగే మొత్తం లోతు 6.7 సెంటి మీటర్లు (2.64 అంగుళాలు), వెడల్పు 10.8 సెంటి మీటర్లకు (4.25 అంగుళాలు) మించకూడదు.

అయితే సర్ఫరాజ్‌ తెచ్చుకున్న బ్యాట్‌ పరిమితులను దాటి ఉండటంతో అంపైర్లు గేజ్‌ చెక్‌ చేసి తిరస్కరించారు. అనంతరం డగౌట్‌తో ఉన్న సహచరుడు ఉర్విల్‌ పటేల్‌ సర్ఫరాజ్‌కు మరో బ్యాట్‌ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనికి కూడా అంపైర్లు గేజ్‌ చెక్‌ చేసిన అనంతరం సక్రమంగా ఉందని, సర్ఫరాజ్‌ను బ్యాటింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆతర్వాత బ్యాటింగ్‌ కొనసాగించిన సర్ఫరాజ్‌ 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆ‍ర్చర్‌, బర్గర్‌, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్‌ శర్మ, సందీప్‌ శర్మ, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీసి ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. 

సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్‌ (43), కార్తీక్‌ శర్మ (18, సర్ఫరాజ్‌ ఖాన్‌ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్‌ పోరాడటంతో సీఎస్‌కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప ఛేదనలో రాయల్స్‌ ఓపెనర్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ గత ఎడిషన్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement