మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది? | IPL 2026: Buttler Poor Batting Vs Punjab Sparks Debate on His T20 Form | Sakshi
Sakshi News home page

IPL 2026: మూగబోయిన బ్యాట్‌.. విధ్వంస వీరుడికి ఏమైంది?

Apr 1 2026 7:27 AM | Updated on Apr 1 2026 9:26 AM

IPL 2026: Buttler Poor Batting Vs Punjab Sparks Debate on His T20 Form

Courtesy: IPL 2026

టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు...ఇంగ్లండ్‌కు టి20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ ... ఐపీఎల్‌లో ఏడు సెంచరీలు సహా నాలుగు వేలకు పైగా పరుగులు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్‌ రాయల్స్‌ విజయాల్లో కీలక పాత్ర... గత ఏడాది కూడా గుజరాత్‌ తరఫున 163 స్ట్రయిక్‌ రేట్‌తో 538 పరుగులు... కానీ ఇప్పుడు జోస్‌ బట్లర్‌ ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. బౌండరీలు కాదు కదా సింగిల్‌ తీయడమే కష్టంగా మారిపోయింది.  తనపై వస్తున్న విమర్శలకు బట్లర్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్తాడేమో చూడాలి..

ఇటీవల టీ20 ప్రపంచకప్‌లోనూ బట్లర్‌ పేలవ ప్రదర్శన చేశాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 87 పరుగులే చేసిన బట్లర్‌ ఐదుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. నిజానికి రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో బట్లర్‌ ఆట ఏమాత్రం బాగా లేదు. గత నాలుగు ఐసీసీ టోర్నీల్లో కలిపి (రెండు టీ20 ప్రపంచకప్‌లు, వన్డే వరల్డ్‌కప్, చాంపియన్స్‌ ట్రోఫీ) ఇంగ్లండ్‌ తరఫున 28 ఇన్నింగ్స్‌లలో బట్లర్‌ ఒకే ఒక అర్ధసెంచరీ చేయడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. 

అయితే ఐపీఎల్‌కు వచ్చేసరికి అన్నీ వెనక్కి తోసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి చెలరేగుతాడని ఆశించిన టైటాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రీజ్‌లో ఉన్నంత సేపు బట్లర్‌ చాలా ఇబ్బందిగా కనిపించాడు. అసలు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. తన తొలి 30 బంతుల్లో అతను 11 డాట్‌ బాట్స్‌ ఆడాడు. 

ఆ తర్వాత లెక్క సరి చేసేందుకు అతను చాలా శ్రమించాడు. స్వీప్, రివర్స్‌ స్వీప్‌లు ప్రయత్నించినా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. చివరకు చహల్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు డాట్‌ బాల్స్‌ తర్వాత అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. కేవలం 115.15 స్ట్రయిక్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ ముగించడం బట్లర్‌ స్థాయికి సరిపోదని క్రికెట్‌ ఫ్యాన్స్‌ వాపోయారు.

2022లో ఆరెంజ్‌ క్యాప్‌..
2022 ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లేఆఫ్స్‌ చేరడంలో బట్లర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చిన బట్లర్‌ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. 868 పరుగులు చేసిన బట్లర్‌ ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్‌ ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా, ఐపీఎల్‌ చరిత్రలో రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 

2023, 2024 సీజన్లలోనూ బట్లర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫునే ప్రాతినిధ్యం వహించాడు. అయితే 2025 మెగావేలంలో బట్లర్‌ను దక్కించుకునేందుకు రాజస్తాన్‌, గుజరాత్‌ టైటాన్స్‌ పోటీ పడ్డాయి. చివరకు బట్లర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 15.06 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో గుజరాత్‌ తరఫున 14 మ్యాచ్‌ల్లో 538 పరుగులు సాధించాడు. 

లెక్క సరిచేయాలి..
కానీ ఈ సీజన్‌లో మాత్రం బట్లర్‌ బ్యాట్‌ మూగబోయినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ అయినప్పటికీ బట్లర్‌ ఆడిన తీరు అతడు ఫామ్‌లేమితో సతమత మవుతున్నట్లు అర్థమవుతుంది.  తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు బట్లర్‌కు ఒక్క ఇన్నింగ్స్‌ చాలు. రాబోయే మ్యాచ్‌ల్లో బట్లర్‌ మెరవాలని కోరుకుందాం. 

చదవండి: చెన్నై ఓటమి వెనుక తప్పులెన్నో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement