
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.
గుజరాత్, పంజాబ్ కూడా..!
నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్‌కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీ
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్‌కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨
- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025
ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్‌లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్.