#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్‌ | IPL 2024: Shreyas Reveals KKR Were Contemplating Whether To Open With Narine, See Details Inside- Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs KKR: పిచ్‌ ఎలా ఉందో ముందే చెప్పాడు.. అతడు అద్భుతం: అయ్యర్‌

Mar 30 2024 9:36 AM | Updated on Mar 30 2024 11:30 AM

IPL 2024: Shreyas Reveals KKR Were Contemplating Whether to Open With Narine - Sakshi

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌పై ఆ జట్టు సారథి శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్‌గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2024లో భాగంగా కేకేఆర్‌ శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్‌పై.. సెకండాఫ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు.

ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సునిల్‌ నరైన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 47 పరుగులు చేశాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 39, రింకూ సింగ్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్‌ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

తద్వారా పదిహేడో ఎడిషన్‌లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్‌ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్‌ చెప్పాడని.. పిచ్‌ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు.

ఈ క్రమంలో సునిల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్‌గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్‌కు స్పష్టంగా తెలుసని అయ్యర్‌ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో రసెల్‌ నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్‌ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్‌ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది.

చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement