SRH vs RR: ‘సన్‌రైజర్స్‌ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్‌’ | Sakshi
Sakshi News home page

SRH vs RR: సన్‌రైజర్స్‌ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్‌: అంబటి రాయుడు

Published Thu, May 23 2024 2:20 PM

IPL 2024 Qualifier 2 RR Are Favorites: Ambati Rayudu on SRH vs Rajasthan

ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.

ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్‌ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్‌ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.

ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్‌-2లో
ఇక సునిల్‌ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్‌ వార్‌ వన్‌సైడ్‌ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

ఫైనల్‌ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌
సన్‌రైజర్స్‌- రాజస్తాన్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.

చెన్నై పిచ్‌ పరిస్థితులు కూడా రాజస్తాన్‌ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.

అది హైదరాబాద్‌ వికెట్‌ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్‌ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్‌ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ఫైర్‌
అయితే, ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్‌ మాదిరే సన్‌రైజర్స్‌ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ జట్టులోనూ షాబాజ్‌ అహ్మద్‌, మయాంక్‌ మార్కండే, విజయకాంత్‌ వియస్కాంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. 

అనుభవం లేకపోయినా మొమెంటమ్‌ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో చెన్నై దిగ్గజం‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్‌ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.‌

చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్‌ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్‌ వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement