IPL Retention- Venkatesh Iyer: వెంకటేశ్‌ అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు.. ఏకంగా 4000 శాతం హైక్‌!

IPL 2022 Retention: KKR Venkatesh Iyer Received 4000 Percent Hike In Salary - Sakshi

IPL 2022 Retention: KKR Venkatesh Iyer Received 4000 Percent Hike In Salary: ఒక్కసారి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోతే చాలు మినిమమ్‌ లక్షాధికారి అయిపోవచ్చు. అదే.. ఆడే అవకాశం రావడం.. అందునా ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే ఇంక చెప్పేదేముంటుంది. కోట్లు కొల్లగొట్టేయచ్చు. ప్రతిభను నిరూపించుకుంటే చాలు కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఎగబడతాయి. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రికెటర్లు ఈ లీగ్‌ ద్వారా ధనవంతులైపోయారు. ఐపీఎల్‌ మెగా వేలం-2022 నేపథ్యంలో వెంకటేశ్‌ అయ్యర్‌ను రిటెన్షన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వెచ్చించిన మొత్తమే ఈ ప్రస్తావనకు కారణం.

వెంకటేశ్‌ అయ్యర్‌ను కేవలం 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది కేకేఆర్‌. అయితే, ఐపీఎల్‌-2021లో భాగంగా యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో అతడు అత్యద్భుతంగా రాణించడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. 10 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ స్టార్‌ ఓపెనర్‌ 370 పరుగులు చేశాడు. జట్టు ఫైనల్‌ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని రిటైన్‌ చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఫ్రాంఛైజీ.. ఏకంగా 8 కోట్లు ఖర్చు చేసింది. 

దీంతో వెంకటేశ్‌ అయ్యర్‌ సాలరీ దాదాపు 40 రెట్లు(4000%) పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అయ్యర్‌ గనుక వేలంలోకి వస్తే రికార్డులు బద్దలయ్యేవి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా వెంకటేశ్‌ ఇటీవలి న్యూజిలాండ్‌ సిరీస్‌తో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాను ఆల్‌రౌండర్‌ను అని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలో ఆడేందు​కైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. 

ఇక ఐపీఎల్‌ రిటెన్షన్‌ విషయానికొస్తే.. కేకేఆర్‌ ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (రూ. 6 కోట్లు)ను కొనసాగిస్తామని ప్రకటించింది. ఇందుకోసం 42 కోట్లు ఖర్చు చేయగా.. కోల్‌కతా పర్సులో ఇంకా 48 కోట్ల రూపాయలు ఉన్నాయి.

చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top