
మహిళల ఆసియా కప్ బరిలో భారత మహిళల హాకీ జట్టు
నేడు తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ‘ఢీ’
హాంగ్జౌ (చైనా): సీనియర్ గోల్‌కీపర్ సవితా పూనియా... స్టార్ డ్రాగ్ ఫ్లికర్ దీపిక గైర్హాజరీలో.. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు శుక్రవారం పూల్ ‘బి’లోని తమ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో... థాయ్‌లాండ్ 30వ స్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ భారీ విజయంపై గురి పెట్టింది.
పూల్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు జపాన్ (12వ ర్యాంక్), సింగపూర్ (31వ ర్యాంక్) జట్లున్నాయి. శుక్రవారం థాయ్‌లాండ్‌తో మ్యాచ్ తర్వాత... శనివారం జపాన్‌తో, సోమవారం సింగపూర్‌తో భారత్ ఆడుతుంది. పూల్ ‘ఎ’లో చైనా, దక్షిణ కొరియా, మలేసియా, చైనీస్ తైపీ జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు పూల్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడతాయి.
ఆసియా కప్ విజేత జట్టుకు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత లభిస్తుంది. చీలమండ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న మాజీ కెపె్టన్, గోల్‌కీపర్ సవితా పూనియా స్థానంలో గోల్ కీపింగ్ బాధ్యతలు బిచ్చూదేవి, బన్సారి సోలంకి తీసుకుంటారు. దీపిక లేని లోటును డిఫెన్స్‌లో ఉదిత, నిక్కీ ప్రధాన్, మనీషా చౌహాన్, ఇషిక, సుమన్ దేవి భర్తీ చేయాల్సి ఉంటుంది.
నేహా, కెప్టెన్ సలీమా టెటె, లాల్‌రెమ్‌సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, వైష్ణవిలతో భారత మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా ఉంది. ఫార్వర్డ్ శ్రేణిలో నవ్‌నీత్ కౌర్, సంగీత, ముంతాజ్ ఖాన్, బ్యూటీ డుంగ్‌డుంగ్, రుతుజా, సాక్షి సత్తా చాటాల్సి ఉంటుంది. ఈ టోర్నీ భారత చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు కూడా పరీక్షగా నిలువనుంది. ఇటీవల యూరోపియన్ అంచె ప్రొ లీగ్‌లో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది.
ప్రొ లీగ్‌లో భారత జట్టు 100 కంటే ఎక్కువ పెనాల్టీ కార్నర్‌లను సమర్పించుకోగా.. బెల్జియంతో జరిగిన పోరులో ఏకంగా 17 పెనాల్టీ కార్నర్‌లు ఉన్నాయి. 1985లో మొదలైన ఈ టోర్నీలో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు (1999, 2009) రన్నరప్‌గా నిలిచింది. మూడుసార్లు (1993, 2013, 2022) మూడో స్థానాన్ని పొందిన టీమిండియా ... రెండుసార్లు (1989, 2007) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.