IND Vs NZ: రోహిత్‌కే టి20 పగ్గాలు.. జట్టులోకి వెంకటేశ్‌ అయ్యర్‌, రుతురాజ్

India Vs New Zealand: Venkatesh Iyer, Ruturaj Gaikwad, Harshal Patel Picked For T20Is - Sakshi

పొట్టి ఫార్మాట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియామకం

న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

కోహ్లి, బుమ్రా, షమీ, జడేజాలకు విశ్రాంతి

వెంకటేశ్‌ అయ్యర్, హర్షల్‌ పటేల్,  అవేశ్‌ ఖాన్‌లకు తొలిసారి చోటు

Venkatesh Iyer, Ruturaj Gaikwad, Harshal Patel Picked For T20Is Against New Zealand: న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. లాంఛనం ముగిసింది. భారత టి20 క్రికెట్‌ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ టోర్నీ సందర్భంగా టి20 ప్రపంచకప్‌ తర్వాత తాను భారత టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్‌ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మను ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.  

టి20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో రోహిత్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. గతంలో కోహ్లి గైర్హాజరీలో రోహిత్‌ శర్మ 19 మ్యాచ్‌ల్లో భారత టి20 జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. రోహిత్‌ కెప్టెన్సీలో భారత జట్టు 15 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 2017లో 3 మ్యాచ్‌ల్లో... 2018లో 9 మ్యాచ్‌ల్లో... 2019లో 6 మ్యాచ్‌ల్లో... 2020లో ఒక్క మ్యాచ్‌లో రోహిత్‌ భారత టి20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.  

హార్దిక్, వరుణ్‌లపై వేటు 
టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్‌ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యారు. ఫిట్‌నెస్‌ సమస్యలు.. ఫామ్‌లో లేకపోవడం కారణంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. టి20 ప్రపంచకప్‌లో ఆడిన శార్దుల్‌ ఠాకూర్, రాహుల్‌  చహర్‌లను కూడా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్‌ పటేల్, దీపక్‌ చహర్, హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌లకు మళ్లీ పిలుపు వచ్చింది.  

మూడు కొత్త ముఖాలు... 
ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), హర్షల్‌ పటేల్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), అవేశ్‌ ఖాన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో 370 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో హరియాణా జట్టుకు ఆడే గుజరాత్‌కు చెందిన 30 ఏళ్ల హర్షల్‌ పటేల్‌ ఐపీఎల్‌లో 32 వికెట్లు తీసి ‘పర్పుల్‌ క్యాప్‌’ గెల్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల అవేశ్‌ ఖాన్‌ ఈ ఐపీఎల్‌లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో 635 పరుగులు సాధించిన మహారాష్ట్ర ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన రుతురాజ్‌ భారత్‌ తరఫున రెండు టి20 మ్యాచ్‌ల్లో ఆడాడు.  

తొలి టెస్టుకు కూడా రోహితే కెప్టెన్‌! 
న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ ముగిశాక రెండు టెస్టులు జరగనున్నాయి. తొలి టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ తొలి టెస్టులో టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం. డిసెంబర్‌ 3 నుంచి 7 వరకు ముంబైలో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఇక వన్డే ఫార్మాట్‌లోనూ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్‌ శర్మకే పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ ఆడనుండటంతో అప్పుడే ఈ మార్పు జరిగే అవకాశముంది.  

భారత టి20 జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, భువనేశ్వర్, దీపక్‌ చహర్, హర్షల్‌ పటేల్, మొహమ్మద్‌ సిరాజ్‌. 

భారత్, న్యూజిలాండ్‌ టి20 సిరీస్‌ షెడ్యూల్‌ 
నవంబర్‌ 17: తొలి మ్యాచ్‌ (జైపూర్‌లో) 
నవంబర్‌ 19: రెండో మ్యాచ్‌ (రాంచీలో) 
నవంబర్‌ 21: మూడో మ్యాచ్‌ (కోల్‌కతాలో) 

చదవండి: పొట్టి క్రికెట్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top