Team India: టెస్టులకు సూర్య.. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో శ్రీకర్‌ భరత్‌ 

BCCI Announce Squad For NZ ODI-T20 Series Along With-1st-2 Tests Vs AUS - Sakshi

ఇషాన్‌ కిషన్‌కు తొలిసారి పిలుపు

ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు జట్టు ప్రకటన

 

ముంబై: ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై జరిగే ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’లోని తొలి రెండు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. టి20లో తన విధ్వంసక ఆటతో చెలరేగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అవకాశం రాకపోయినా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ సూర్యకు మంచి రికార్డే ఉంది. 79 మ్యాచ్‌లలో అతను 44.75 సగటుతో 5549 పరుగులు చేయగా, ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.

మరోవైపు కారు ప్రమాదానికి గురైన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశారు. ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్‌ (కేఎస్‌) భరత్‌ ఇప్పటికే టెస్టు టీమ్‌తో ఉండగా (ఇంకా మ్యాచ్‌ ఆడలేదు), కిషన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. బుమ్రాను ఎంపిక చేయకపోవడంతో అతను పూర్తిగా కోలుకోలేదని తేలింది. గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజానూ జట్టులోకి తీసుకున్నా... ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఫిబ్రవరి 9నుంచి నాగపూర్‌లో తొలి టెస్టు జరుగుతుంది.  

టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో భరత్‌ 
ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ టి20ల్లో తాను ఆడిన ఏకైక టి20లో తొలి బంతికే అవుటైన పృథ్వీ షా భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం సెలక్టర్లు అతడికి అవకాశం కల్పించారు. ఇది మినహా చెప్పుకోదగ్గ మార్పులేమీ లేకుండా ఇటీవల శ్రీలంకతో టి20 సిరీస్‌ గెలిచిన జట్టునే ఎంపిక చేశారు. కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా కొనసాగనున్నాడు.

ఈ సిరీస్‌లో కూడా రోహిత్, కోహ్లిలను ఎంపిక చేయకపోవడంతో అది ‘విశ్రాంతి’నా లేక టి20 భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా వారిని పక్కన పెట్టేశారా అనేదానిపై స్పష్టత లేదు. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే జట్టులో ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు తొలిసారి అవకాశం లభించింది. శార్దుల్‌ ఠాకూర్‌ పునరాగమనం చేయగా, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షహబాజ్‌ అహ్మద్‌కు కూడా చోటు కలి్పంచారు. వన్డేల్లో మాత్రం రోహిత్, కోహ్లి అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత కారణాలతో కేఎల్‌ రాహుల్, అక్షర్‌లను రెండు జట్లలోనూ ఎంపిక చేయలేదని సెలక్టర్లు వెల్లడించారు. ఈ నెల 18, 21, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.  

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వై చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్ ((వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top