6 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘనవిజయం‌‌‌‌

India Vs England 2nd ODI Live Updates Telugu - Sakshi

బెయిర్‌ స్టో, స్టోక్స్‌ పెను విధ్వంసం.. రెండో వన్డే ఇంగ్లండ్‌దే 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పూణే వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెయిర్‌ స్టో, స్టోక్స్‌ పెను విధ్వంసం సృష్టించడంతో పర్యాటక జట్టు 6 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లండ్‌.. 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. ఇరు జట్ల మధ్య సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌ ఆదివారం (మార్చి 28) జరుగనుంది.

9 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌
అప్పటిదాకా సిక్సర్ల సునామీ సృష్టించిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు, ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయారు.  9 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి కుదుపునకు లోనయ్యారు. విధ్వంసకర ఆటగాళ్లు స్టోక్స్‌, బెయిర్‌ స్టో, బట్లర్‌లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. స్టోక్స్‌ను భువీ.. బెయిర్‌ స్టో, బట్లర్‌ వికెట్లను ప్రసిద్ద్‌ కృష్ణ పడగొట్టారు. 37 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 288/4. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌(1), మలాన్‌(1) ఉన్నారు.

బట్లర్‌ డకౌట్‌
ప్రసిద్ద్‌ కృష్ణ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 37 ఓవర్‌ తొలి బంతికి బెయిర్‌ స్టోను పెవిలియన్‌కు పంపిన ఆయన.. బట్లర్‌ను డకౌట్‌ చేశాడు. ప్రసిద్ద్‌ వేసిన అద్భుతమైన యార్కర్‌కు బట్లర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యడు. 36.4 ఓవర్ల‌ తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 287/4. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌(1), మలాన్(1)‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
సెంచరీ హీరో బెయిర్‌ స్టో(112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు‌)ను ప్రసిద్ద్‌ కృష్ణ పెవిలియన్‌కు పంపాడు. బెయిర్‌ స్టో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో కవర్స్‌లో ఉన్న కోహ్లి చేతికి క్యాచ్‌ అందించి ఔటయ్యాడు. 36.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 287/3. క్రీజ్‌లో బట్లర్‌(0), మలాన్(1)‌ ఉన్నారు.

99 పరుగుల వద్ద స్టోక్స్‌ ఔట్‌
వరుస సిక్సర్లతో విరుచుకుపడిన బెన్‌ స్టోక్స్(52 బంతుల్లో 99; 4 ఫోర్లు‌, 10 సిక్స్‌లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుటయ్యాడు. భువనేశ్వర్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను పుల్‌ చేసే క్రమంలో వికెట్‌కీపర్‌ పంత్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. 36 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 285/2.

స్టోక్స్‌ పెను విధ్వంసం.. ఇంగ్లండ్‌ సిక్సర్ల సునామీ
ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(50 బంతుల్లో 95; 3 ఫోర్లు‌, 10 సిక్స్‌లు) సిక్సర్ల సునామీలో టీమిండియా బౌలర్లు కొట్టుకుపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్‌, కృనాల్‌ వేసిన వరుస ఓవర్లలో స్టోక్స్‌ పెను విధ్వంసమే సృష్టించాడు. స్టోక్స్‌ వరుసగా సిక్సర్లు బాదుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని ధాటికి 34 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 266 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టోక్స్‌, బెయిర్‌ స్టో(102 బంతుల్లో 109; 9 ఫోర్లు, 6 సిక్సర్లు‌) ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలుపుకు 96 బంతుల్లో 70 పరుగులు సాధించాల్సి ఉంది.

స్టోక్స్‌ సూపర్‌ ఫిఫ్టీ
ఓ పక్క బెయిర్‌ స్టో సిక్సర్లతో వీరవిహారం చేస్తుండగా, మరో ఎండ్‌లో ఉన్న స్టోక్స్‌ సైతం తానేమీ తక్కువకాదంటూ అదిరిపోయే అర్ధశతకాన్ని సాధించాడు. స్టోక్స్‌ 40 బంతుల్లో 2 ఫోర్లు‌, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 218/1. ఇంగ్లండ్‌ గెలవాలంటే 18 ఓవర్లలో 119 పరుగులు సాధించాల్సి ఉంది. 

బెయిర్‌ స్టో శతకం                  
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో(95 బంతుల్లో 101; 8 ఫోర్లు, 6 సిక్సర్లు‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి అద్భుత శతకం సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న స్టోక్స్‌(39 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్స్‌లు) సైతం సిక్సర్లతో విరుచుకుపడటంతో 30.1 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 200 పరుగుల మార్కును దాటింది. ఇంగ్లండ్‌ గెలవాలంటే 119 బంతుల్లో 137 పరుగులు సాధించాల్సి ఉంది.  

ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్‌.. 28 ఓవర్ల తర్వాత 180/1
భారత్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ధీటుగా బదులిస్తున్నారు. తొలి వికెట్‌ కోల్పోయిన తరువాత జోరు పెంచిన బెయిర్‌ స్టో(87 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు‌) ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరో ఎండ్‌లో స్టోక్స్‌(29 బంతుల్లో 33; 3 సిక్సర్లు‌) కూడా భారీ షాట్లు ఆడుతుండటంతో 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 180/1. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. జేసన్‌ రాయ్‌(55) రనౌట్
తొలి వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(51 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్‌) ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసంతో జేసన్‌ రాయ్‌ను రనౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. 16.3 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 110/1. బెయిర్‌ స్టో(47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు‌)కు జతగా స్టోక్స్‌(0) క్రీజ్‌లోకి వచ్చాడు. 

జేసన్‌ రాయ్‌ ఫిఫ్టీ.. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ 87/0
337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(51 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్‌), బెయిర్‌ స్టో(39 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్‌)లు ఆచితూచి ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈక్రమంలో జేసన్‌ రాయ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 15 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 87/0.

టీమిండియా భారీ స్కోర్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 337
రాహుల్‌(108) అద్భుత శతకానికి తోడు పంత్‌(40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం, కోహ్లి(66) బాధ్యతాయుత హాఫ్‌ సెంచరీ, ఆఖర్లో హార్ధిక్‌(16 బంతుల్లో 35; ఫోర్‌, 4 సిక్సర్లు) వీరవిహారం తోడవటంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లు టాప్లే, టామ్‌ కర్రన్‌ చెరో రెండు వికెట్లు, రషీద్‌, సామ్‌ కర్రన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
వరుస సిక్సర్లతో చెలరేగిన హార్ధిక్‌ పాండ్యాను టాప్లే బోల్తా కొట్టించాడు. హార్ధిక్‌(16 బంతుల్లో 35; ఫోర్‌, 4 సిక్సర్లు).. మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో జేసన్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 49.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 334/6. శార్ధూల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు

పంత్‌(77) ఔట్‌
భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన రిషబ్‌ పంత్‌(40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఎట్టకేలకు అవుటయ్యాడు. టామ్‌ కర్రన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పంత్‌.. జేసన్‌ రాయ్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ బాట పట్టాడు. 46.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 308/5. క్రీజ్‌లో హార్ధిక్‌(7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), కృనాల్‌(0) ఉన్నారు. 

రాహుల్‌(108) ఔట్
టామ్‌ కర్రన్‌ వేసిన స్లో బౌన్సర్‌ను అందాజు వేయలేకపోయిన రాహుల్‌(114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు).. టాప్లేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 44.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 271/4. హార్ధిక్‌ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు.

రాహుల్‌ అద్భుత శతకం.. పంత్‌ విధ్వంసం 
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస వైఫల్యాలతో, జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్న కేఎల్‌ రాహుల్‌ వన్డే సిరీస్‌లో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకంతో అదరగొట్టిన రాహుల్‌.. రెండో వన్డేలో ఏకంగా శతకొట్టేశాడు. సెకెండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌ ఆరంభంలో ఆచితూచి ఆడినప్పటికీ, అతర్వాత గేర్‌ మార్చి భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో అతను కెరీర్‌లో ఐదో శతకాన్ని నమోదు చేశాడు. అతను108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అతనికి పంత్‌(30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం తోడవ్వడంతో 43.1 ఓవర్‌ ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.

మూడో వికెట్ కోల్పోయిన భారత్‌, కోహ్లి(66) ఔట్‌‌
32 ఓవర్ ఆఖరి బంతికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(79 బంతుల్లో 66; 3 ఫోర్లు, సిక్స్‌) ఔటయ్యాడు. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 158/3. క్రీజ్‌లో రాహుల్‌కు పంత్‌ జతకలిశాడు.

కోహ్లి, రాహుల్‌ అర్ధశతకాలు
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(76 బంతుల్లో 65; 3 ఫోర్లు, సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌(68 బంతుల్లో 52; 3 ఫోర్లు)లు అర్ధశతకాలు పూర్తి చేశారు. వీరి జోడీ మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసింది. మొదట కోహ్లి 62 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేయగా, ఆతరువాత రాహుల్‌ 66 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. దీంతో 31 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 149/2. 

100 దాటిన భారత్‌ స్కోర్‌
22.1 ఓవర్లలో టీమిండియా స్కోర్‌ 100 పరుగులు దాటింది. 23 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజ్‌లో కోహ్లి(39), రాహుల్‌(32) ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లు సామ్‌ కర్రన్‌, టాప్లే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

16 ఓవర్లలో 72/2
టీమిండియా 16 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌(4) తొలి వికెట్‌గా ఔట్‌ కాగా, రోహిత్‌ శర్మ(25; 25 బంతుల్లో 5 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత కోహ్లి, రాహుల్‌ జోడి ఇన్నింగ్స్‌ను  మరమ్మత్తులు చేపట్టింది. శిఖర్‌ ధావన్‌ నాల్గో ఓవర్‌లో ఔట్‌ కాగా, రోహిత​ శర్మ 9వ ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడుధవన్‌ను టోప్లీ పెవిలియన్‌కు పంపగా, .  రోహిత్‌ను సామ్‌ కరాన్‌ ఔట్‌ చేశాడు. 

షార్ట్‌ ఫైన్‌లెగ్‌లోకి ఆడబోయి..
టీమిండియా స్వల్ప విరామాల్లో రెండు వికెట్లను కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌ నాల్గో ఓవర్‌లో ఔట్‌ కాగా, రోహిత​ శర్మ 9వ ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. సామ్‌ కరాన్‌ వేసిన 9 ఓవర్‌ నాల్గో బంతిని రోహిత్‌ లెగ్‌ సైడ్‌ వైపు ఫ్లిక్‌ చేయబోయి రషీద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్వింగ్‌ అవుతూ వచ్చిన ఆ బంతిని రోహిత్‌ ఫోర్‌కు పంపిద్దామనుకుని షార్ట్‌ ఫైన్‌లెగ్‌ వైపుగా  ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న రషీద్‌ ఈజీ అందుకోవడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. రోహిత్‌ 25 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో 37 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది.

ధవన్‌  విఫలం
మ్యాచ్‌ ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌(4) విఫలమయ్యాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా నాల్గో ఓవర్‌ ఐదో బంతికి ధవన్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. టోప్లీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో టీమిండియా 9 పరుగులకే వికెట్‌ను కోల్పోయింది.  

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించిన టీమిండియా మంచి జోష్‌తో రెండో వన్డేకు సిద్దమైంది. పుణే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్‌ ఎంచుకొంది. ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి వన్డేలో భుజం గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగిన శ్రెయాస్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు  ఈ వన్డే కోసం రెండు మార్పులు చేసింది. కెప్టెన్‌ మోర్గాన్‌ గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమవడంతో అతని స్థానంలో జాస్‌ బట్లర్‌ నాయకత్వం వహించనున్నాడు. తొలి వన్డేలో గాయపడిన సామ్‌ బిల్లింగ్స్‌ స్థానంలో లివింగ్‌ స్టోన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌ మాత్రం రెండో వన్డేలో గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశముంది. కోహ్లిసేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే.. పర్యాటక జట్టు మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది.

తుది జట్టు:

భారత్‌: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్ శర్మ, ధావన్, పంత్‌, కేఎల్‌ రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిధ్‌.


ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, స్యామ్‌ కరన్, టామ్‌ కరన్, రషీద్, టోప్లీ.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top