లీగ్‌ దశలోనే భారత్‌ అవుట్‌ | India Uber Cup journey concludes with a disappointing 0-5 loss to China | Sakshi
Sakshi News home page

లీగ్‌ దశలోనే భారత్‌ అవుట్‌

Apr 29 2026 3:00 AM | Updated on Apr 29 2026 3:00 AM

India Uber Cup journey concludes with a disappointing 0-5 loss to China

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌ కప్‌ మహిళల బ్యాడ్మింట్‌ టీమ్‌ టోర్నీలో ఈసారి భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గత మూడు పర్యాయాల్లో నాకౌట్‌ దశకు అర్హత పొందిన టీమిండియా ఈసారి మాత్రం లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే 16 సార్లు చాంపియన్‌ చైనా జట్టుపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు 0–5తో పరాజయం పాలైంది.

గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన చైనా... భారత్, ఉక్రెయిన్‌ జట్లపై గెలిచిన డెన్మార్క్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించాయి. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 78 నిమిషాల్లో 16–21, 21–19, 19–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి చేతిలో పోరాడి ఓడిపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒకదశలో 18–12తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత సింధు ఒక పాయింటే నెగ్గగా... వాంగ్‌ జి యి తొమ్మిది పాయింట్లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా 11–21, 8–21తో లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ చేతిలో ఓడిపోయారు.

మూడో మ్యాచ్‌లో ఇషారాణి బారువా 20–22, 13–21తో చెన్‌ యుఫె చేతిలో... నాలుగో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–సెల్వం కవిప్రియ 21–10, 12–21, 19–21తో లువో జు మిన్‌–జాంగ్‌ షు జియాన్‌ చేతిలో... ఐదో మ్యాచ్‌లో దేవిక సిహాగ్‌ 21–19, 17–21, 10–21తో జు వెన్‌ జింగ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2016 ఉబెర్‌ కప్‌ టోరీ్నల్లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు గెలిచిన భారత జట్టు... 2018లో లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత 2020, 2022, 2024లలో క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement