
టోక్యో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. టోర్నీ తొలి రోజు మహిళల డబుల్స్ విభాగంలో ‘పాండా సిస్టర్స్’ జోడీ రుతపర్ణ–శ్వేతపర్ణ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. కొకోనా ఇషికావా–మైకో కవాజోయి (జపాన్) ద్వయంతో జరిగిన మ్యాచ్‌లో ఒడిశాకు చెందిన రుతపర్ణ–శ్వేతపర్ణ 13–21, 7–21తో ఓడిపోయింది.
32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లో ఆరంభ దశలో రుతపర్ణ–శ్వేతపర్ణ ఆకట్టుకున్నా... ఆ తర్వాత తడబడ్డారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్ సిమ్ జు యున్‌తో పీవీ సింధు... ప్రపంచ 7వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో ఉన్నతి హుడా; రక్షిత శ్రీతో అనుపమ పోటీపడతారు.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో చైనా ప్లేయర్ వాంగ్ జెంగ్ జింగ్‌తో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్‌లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; హరిహరన్–రూబన్ కుమార్ జోడీలు పోటీపడుతున్నాయి. తొలి రౌండ్‌లో కాంగ్ మిన్ హియుక్–కి డాంగ్ జు (దక్షిణ కొరియా)లతో సాతి్వక్–చిరాగ్; కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)లతో హరిహరన్–రూబన్ తలపడతారు.