IND Vs SL: ఓపెనర్లు వారిద్దరే.. ఐపీఎల్‌ హీరోలకు మొండిచెయ్యే..?

IND Vs SL: Prithvi Shaw Likely To Open Innings With Shikhar Dhawan - Sakshi

కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌, యువ ఆటగాడు పృథ్వీ షా పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. దీంతో టీమిండియాకు తొలిసారి ఎంపికైన రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌లకు మొండిచెయ్యి తప్పేట్లు లేదు. ఈ ఇద్దరికీ తుది జట్టులో స్థానం దక్కేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా పరుగుల వరద పారించాడు. భారీ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ 2021లో సైతం అదరగొట్టాడు. దీంతో సీనియర్‌ ఓపెనర్‌ ధవన్‌కు జతగా పృథ్వీ షా అయితే బాగుంటుందని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఐపీఎల్‌లోనూ వీరిద్దరు ఒకే జట్టుకు (ఢిల్లీ క్యాపిటల్స్) ఓపెనింగ్‌ చేయడం అదనంగా కలిసొచ్చే అంశం. కాగా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున పడిక్కల్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున రుతురాజ్‌ ఓపెనర్లుగా అదరగొట్టారు. అయినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా వీరిద్దరు మరికొంత సమయం వేచి చూడక తప్పేట్టు లేదు. ఇక మూడో స్థానం కోసం కూడా భారీ పోటీనే(నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌) నెలకొన్నప్పటికీ.. యాజమాన్యం సూర్యకుమార్‌వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు. అయితే, సంజుకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్న అపవాదు బీసీసీఐపై ఉంది కాబట్టి.. అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 

స్పిన్నర్ల కోటాలో చహల్‌కు తోడుగా కృనాల్ పాండ్యాను తీసుకుంటే బ్యాటింగ్‌లో కూడా పనికొస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఇక పేసర్ల విభాగంలో మిగిలిన ఖాళీ కోసం నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియాలు పోటీపడుతున్నారు. అయితే, ఐపీఎల్‌లో అంచనాలకు మించి రాణించిన సకారియాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత యువ జట్టు లంక పర్యటనకు వచ్చింది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో ఉన్నారు. జులై 18 నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top