
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో శతకం దిశగా దూసుకుపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (92) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్‌లు అవసరం కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఈ ఫీట్ సాధించేందుకు ఏకంగా 310 మ్యాచ్‌లు అవసరమయ్యాయి. మరోవైపు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌కు 12500 పరుగులు చేసేందుకు 328 మ్యాచ్‌లు తీసుకున్నాడు. కోహ్లి వన్డేల్లో 57.88 సగటున ఈ పరుగులు స్కోర్ చేశాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (92 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 45 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్ధిక్ పాండ్యా (14) ఔట్ కాగా.. కోహ్లి జతగా అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నాడు.