
దక్షిణాఫ్రికా టూర్: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా అతడే!
India Vs South Africa Test Series- Who Will Be India Vice Captain: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ గైర్హాజరీలో విరాట్ కోహ్లి డిప్యూటీగా వ్యవహరించేది ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే, నయా వాల్ ఛతేశ్వర్ పుజారా, సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో కొత్త పేరు చేరింది.
టీ20 ఫార్మాట్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కే టెస్టు ఫార్మాట్‌లోనూ ఆ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాయి. రహానే ఫామ్‌లేమి దృష్ట్యా తుదిజట్టులో అవకాశం దక్కడమే అనుమానం కాబట్టి.. రాహుల్‌నే కోహ్లి డిప్యూటీగా నియమించే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. ఈ మేరకు.. ‘‘ఈ విషయంలో వేరే ఆలోచనకు తావు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ పేరును సూచించడమే సరైంది. రహానే ఫామ్‌లో లేడు. కాబట్టి తుదిజట్టులో ఉంటాడో లేదో తెలియదు.
అశ్విన్‌ను ఎక్కువగా విదేశాల్లో ఆడించరు. కాబట్టి వైస్ కెప్టెన్ అయ్యే అవకాశం లేదు. రాహుల్ బెస్ట్ ఛాయిస్. ఒకట్రెండు రోజుల్లో కోహ్లి డిప్యూటీగా తన పేరును ప్రకటిస్తారు’’ అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో సౌరాష్ట్ర బ్యాటర్ ప్రియాంక్ పాంచల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్ లభిస్తే.. అతడితో పాటు ఓపెనింగ్ చేసేది మయాంక్ అగర్వాలా లేదంటే.... పాంచల్‌తో ప్రయోగం చేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇక ఇటీవల సౌతాఫ్రికా-ఏతో ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్‌కు పాంచల్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా.
చదవండి: ICC Womens World Cup 2022: పాక్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
Ind Vs Sa: రోహిత్‌కు ఫిట్‌నెస్ మీద సోయి లేదు.. కోహ్లికి ఇంకేదో సమస్య.. ఆట కంటే ఇగోలే ఎక్కువా?