Ind vs Sa 3rd ODI: రెండుసార్లు ఆడించారు... తదుపరి మ్యాచ్‌కే వేటు వేస్తారా?

Ind vs Sa 3rd ODI: Aakash Chopra Surprised Dropping Venkatesh Iyer Does Not Make Sense - Sakshi

Ind vs Sa 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే నుంచి యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ను తప్పించడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా తప్పుబట్టాడు. అతడికి తుది జట్టులో చోటు కల్పించకపోవడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. కేవలం రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చి తన ప్రతిభ గురించి అంచనాకు రావడం సరికాదని పేర్కొన్నాడు. కాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో వెంకటేశ్‌ అయ్యర్‌ తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో పర్ల్‌ వేదికగా సాగిన మొదటి మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కానీ రెండు పరుగులకే అవుట్‌ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక రెండో వన్డేలో 22 పరుగులు చేసిన ఈ యువ ఆల్‌రౌండర్‌ ... 5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 28 పరుగులు ఇచ్చాడు. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా పరాజయం పాలై... సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో నామమాత్రపు ఆఖరి వన్డేలో వెంకటేశ్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ... ‘‘మూడో వన్డేలో వెంకటేశ్‌ అయ్యర్‌ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇలా చేయడంలో ఏమాత్రం అర్థం లేదు. రెండుసార్లు ఆడించారు. అందులో ఒకసారి బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చారు.

ఆ తదుపరి మ్యాచ్‌కే తప్పించేశారు. అంతేనా ఇక? ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగారు. అయ్యర్‌ను తప్పించడం అస్సలు సరికాదు’’ అని మండిపడ్డాడు. కాగా ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌, 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలోనూ విజయం సాధించి వైట్‌వాష్‌ చేయాలని భావిస్తుండగా... కనీసం ఒక్క వన్డే అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని రాహుల్‌ బృందం ఆరాటపడుతోంది. ఈ క్రమంలో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చహర్ తుదిజ‌ట్టులోకి వ‌చ్చారు.

చదవండి: IND Vs SA: కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ త్రో.. బవుమా రనౌట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top