ICC Test Rankings: కోహ్లిని వెనక్కు నెట్టిన రోహిత్‌.. అగ్రస్థానానికి ఎగబాకిన రూట్‌

ICC Test Rankings: Joe Root Reclaims Top Spot, Rohit Sharma Overtakes Kohli - Sakshi

దుబాయ్‌: ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. విరాట్‌ కోహ్లిని అధిగమించి ఐదో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న రోహిత్‌.. 773 రేటింగ్‌ పాయింట్లు సాధించి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకింగ్‌ను సొంతం చేసుకోగా, ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్‌ కోహ్లి 766 పాయింట్లకే పరిమితమై ఆరో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియాతో మూడో టెస్ట్‌లో సూపర్‌ శతకం సాధించిన రూట్‌.. 916 పాయింట్లు తన ఖాతాలో వేసుకుని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(901)ను రెండో స్థానానికి నెట్టి దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్‌ ప్లేస్‌కు చేరాడు. 

భారత్‌తో సిరీస్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న రూట్‌.. ప్రస్తుత సిరీస్‌లో మూడు అద్భుత శతకాల సాయంతో 507 పరుగులు సాధించి కోహ్లి, లబూషేన్(878), స్టీవ్‌ స్మిత్‌(891), విలియమ్సన్‌లను ఒక్కొక్కరిగా వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇక ఈ జాబితా టాప్‌-10 లిస్ట్‌ నుంచి టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఔట్‌ కాగా, పాక్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌(749) ఏడో స్థానానికి ఎగబాకాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పంత్‌(695) ఏకంగా ఐదు స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి దిగజారాడు. ఇక బౌలింగ్‌ విభాగానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో దాదాపు ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(800) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 6వ ప్లేస్‌కు, పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది(783) 14 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, కమిన్స్‌(908), అశ్విన్‌(848), సౌథీ(824) వరుసగా మొదటి మూడు స్థానాల్లో కొనసాగతున్నారు. 
చదవండి: వైడ్‌ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్‌ ఏం చేశాడో చూడండి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top