ఇషాంత్‌ ఇప్పటికీ నా సోదరుడే

I Still Consider Ishant Sharma As My Brother, Sammy - Sakshi

జాతి వివక్షపై స్యామీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: గతంలో భావించినట్లే ఇషాంత్‌ శర్మను ఇప్పుడు కూడా సోదరునిలానే ఆదరిస్తున్నానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ చెప్పాడు. భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మపై తనకు ఎలాంటి కోపం, పగ లేదని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం (2013, 2014) వహించిన సమయంలో జాతి వివక్షకు గురైనట్లు ఇటీవలే గుర్తించిన స్యామీ... తనను ‘కాలూ’(నల్లవాడు) అని సంబోధించిన ఇషాంత్‌ను క్షమించినట్లు తెలిపాడు.

‘నేను పగలు ప్రతీకారాలు పెట్టుకోను. ఇషాంత్‌తో దీని గురించి మాట్లాడాను. ఇది ముగిసిన అధ్యాయం. ఇంతకుముందు ఇషాంత్‌ను ఎలా భావించానో ఇప్పుడు కూడా సోదరునిలాగే ఆదరిస్తా. కానీ ఇకపై భవిష్యత్‌లో ఇలాంటి వాటిని సహించను. అది ఎవరైనప్పటికీ నేను నిలదీస్తా. జాతివివక్షను సహించను. ఇప్పటికే దీని గురించి పోరాడుతున్నా. ఇక ముందూ కొనసాగిస్తా. క్రికెట్‌ వర్గాల్లోనూ దీనిపై అవగాహన కల్పిస్తున్నాం’ అని విండీస్‌కు రెండుసార్లు టి20 ప్రపంచకప్‌ అందించిన స్యామీ పేర్కొన్నాడు. స్యామీ తన కెరీర్‌లో 232 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top