కొత్త సంవత్సరంలోనే దేశవాళీ సీజన్‌: గంగూలీ | I Planning To Start Domestic Cricket From January 1: Sourav Ganguly BCCI Planning To Start Domestic Cricket From January 1 | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరంలోనే దేశవాళీ సీజన్‌: గంగూలీ

Oct 18 2020 5:28 AM | Updated on Oct 18 2020 5:28 AM

I Planning To Start Domestic Cricket From January 1: Sourav Ganguly BCCI Planning To Start Domestic Cricket From January 1 - Sakshi

న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తోన్న ఈ సీజన్‌ దేశవాళీ క్రికెట్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టతనిచ్చాడు. జనవరి 1 నుంచి దేశవాళీ సీజన్‌ను ప్రారంభించనున్నట్లు శనివారం ప్రకటించాడు. బీసీసీఐ అపెక్స్‌ మండలిలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పాడు. ‘దేశవాళీ క్రికెట్‌ గురించి విస్తృతంగా చర్చించాం. 1 జనవరి 2021 నుంచి దేశవాళీ సీజన్‌ ప్రారంభించాలని నిర్ణయించాం. అన్ని టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు. కానీ రంజీ ట్రోఫీని కచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం’ అని గంగూలీ వెల్లడించాడు. జనవరి–మార్చి వరకు రంజీ ట్రోఫీ నిర్వహించే అవకాశముందన్నాడు.

మార్చి, ఏప్రిల్‌ విండో జూనియర్లు, మహిళల క్రికెట్‌కు కేటాయిస్తామని అన్నాడు. ఆసీస్‌లో భారత పర్యటన గురించి మాట్లాడుతూ ‘క్రికెట్‌ ఆస్ట్రేలియా పర్యటన వివరాలను పంపించింది. వాటిపై చర్చించాం. జనవరి మూడో వారంలోగా అక్కడ 4 టెస్టులు ఆడతాం. అక్కడికి వెళ్లాక క్వారంటైన్‌లో కూడా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు’ అని వివరించాడు. ‘ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మరో నాలుగైదు నెలల సమయం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి షెడ్యూల్‌ను రూపొందిస్తాం. భారత్‌లోనే ఈ సిరీస్‌ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ సాధ్యంకాకపోతే రెండో ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని పరిశీలిస్తున్నాం’ అని గంగూలీ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement