భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్ ఇన్‌ఫ్లూయెన్సర్ లిజ్‌లాజ్ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్‌లాజ్.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్యతో ఫొటోషూట్ చేసింది.
కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?
భారత్‌లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్‌లాజ్ ( LizLaz) ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.
అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్ పేలాయి. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్‌ఫ్యూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించగా వైరల్ అయింది. అయితే, తన ఇన్‌స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.
ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్‌లాజ్ మాత్రం ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది
‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.
ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్‌లాజ్ చెప్పుకొచ్చింది.


