వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ గురించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త లలిత్ మోదీ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన వల్ల గేల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత గేల్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదని.. ఆర్థికంగానూ బాగానే స్థిరపడ్డాడని తెలిపాడు.
వేలంలో అమ్ముడుపోలేదు
కాగా ఐపీఎల్ 2008లో మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడిన క్రిస్ గేల్.. 2009, 2010 ఎడిషన్లలో కూడా అదే జట్టుతో కొనసాగాడు. అయితే, నిలకడలేని ప్రదర్శనల కారణంగా 2011 వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు.
ఆ సమయంలో తానే క్రిస్ గేల్‌కు సాయం చేసినట్లు లలిత్ మోదీ తాజాగా వెల్లడించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేను ఐపీఎల్ వదిలేసి లండన్‌కు వచ్చిన రోజులు అవి. నాకు ఇష్టుడైన నా స్నేహితుడు గేల్ అప్పట్లో వేలంలో అమ్ముడుపోలేదు.
అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
అప్పుడు నాకు అతడు కాల్ చేశాడు. తనను ఎవరూ కొనలేదని చెప్పాడు. అందుకు బదులుగా.. ‘నువ్వు బాగా ఆడలేదు కాబట్టే ఎవరూ కొనలేదు. నిజానికి నువ్వు మంచి ఆటగాడికి. కానీ బద్దకం వల్ల ఇలా తయారయ్యావు’ అని చెప్పాను.

ఇందుకు సమాధానంగా.. ‘నాకు భారీగా అప్పులు ఉన్నాయి. బిల్స్ కట్టాలంటే నేను ఐపీఎల్‌లో తప్పక ఆడాల్సిందే’ అని గేల్ తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాడు. అప్పుడు చాలా మందికి కాల్ చేశాను. గేల్‌ను జట్టులోకి తీసుకోమని కోరాను.
కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు నేను విజయ్ మాల్యా ఇంటికి వెళ్లాను. గేల్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని కోరాను. డిరిక్ నాన్స్ గాయపడినట్లు తెలిసింది. అతడి స్థానంలో గేల్‌ను ఆడించమన్నాను.
ఖాళీ చెక్కుపై తలరాత
అప్పుడు విజయ్ ఓ కండిషన్ పెట్టాడు. గేల్ బాగా ఆడితేనే డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, గేల్ మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుత ఆట తీరుతో అలరించి.. తనకు ఇచ్చిన ఖాళీ చెక్కుపై తన తలరాతను రాసుకున్నాడు. కోట్లాది రూపాయల విలువ గల కాంట్రాక్టులు దక్కించుకున్నాడు’’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చాడు.
కాగా 2011లో 12 మ్యాచ్‌లు ఆడిన గేల్ 608 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా యూనివర్సల్ బాస్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2017 వరకు ఆర్సీబీతోనే గేల్ కొనసాగాడు. ఇదిలా ఉంటే.. ఇటు లలిత్ మోదీ.. అటు విజయ్ మాల్యా ఆర్థిక నేరగాళ్లుగా ముద్రపడి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘ఏ క్షణమైనా బ్రెయిన్‌స్ట్రోక్.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’


