
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు.
మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.
భీకర ఫామ్‌లో అలెన్
ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రయిక్‌రేట్ (225) అలెన్‌దే.
అలెన్ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది.