అనూహ్య మార్పు.. జూనియర్‌ హాకీ జట్టుకు కొత్త కోచ్‌ | Hockey India Replaces Junior Women's Coach With Tim White | Sakshi
Sakshi News home page

అనూహ్య మార్పు.. జూనియర్‌ హాకీ జట్టుకు కొత్త కోచ్‌

Apr 11 2026 7:45 AM | Updated on Apr 11 2026 8:37 AM

Hockey India Replaces Junior Women's Coach With Tim White

న్యూఢిల్లీ: భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టుకు టిమ్‌ వైట్‌ కొత్త కోచ్‌గా ఎంపికయ్యాడు. 2023 నుంచి మన అమ్మాయిల జట్టుకు తుషార్‌ ఖండేకర్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండగా... అతడి స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న ఆస్ట్రేలియాకు  చెందిన వైట్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త కోచ్‌గా నియమించింది. 

కోచ్‌ మార్పునకు కారణం వెల్లడించని హాకీ  ఇండియా... వైట్‌ ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటాడనే అంశంలోనూ స్పష్టతనివ్వలేదు. హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో వైట్‌ తమిళనాడు డ్రాగన్స్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బెల్జియం, ఆ్రస్టేలియా జూనియర్‌ జట్లకు కూడా వైట్‌ కోచ్‌గా పనిచేశాడు. వైట్‌ శిక్షణలో బెల్జియం అండర్‌ –21 మహిళల జట్టు జూనియర్‌ ప్రపంచకప్‌ కప్‌లో కాంస్య పతకం నెగ్గింది. 

2021 నుంచి 2024 వరకు బెల్జియం సీనియర్‌ జట్టుతోనూ వైట్‌ కలిసి పనిచేశాడు. ఆ సమయంలో విశేషంగా రాణించిన బెల్జియం జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానం నుంచి మూడో ‘ప్లేస్‌’కు చేరింది. ఆస్ట్రేలియాకు కోచ్‌గా వ్యవహరించిన సయమంలో జూనియర్‌ ప్రపంచకప్‌లో ఆ జట్టు కాంస్యం గెలిచింది. 

‘తమిళనాడు డ్రాగన్స్‌ జట్టుకు కోచ్‌గా భారత్‌లో చాలా సమయం గడిపా. అక్కడి హాకీ ఘన సంస్కృతి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల సమయంలో యువ నైపుణ్యం నన్ను కట్టిపడేసింది. అలాంటి అత్యుత్తమ అథ్లెట్లతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనుండటం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. సీనియర్‌ జట్టులో స్థానం కోసం పోటీపడగల సామర్థ్యం ఉన్న పటిష్టమైన ప్లేయర్లను తయారు చేయడమే నా లక్ష్యం. 

అటాకింగ్‌ గేమ్‌కు పదును పెడుతూనే... డిఫెన్స్‌లోనూ మరింత క్రమశిక్షణ పెంచాలని భావిస్తున్నా. మైదానంలో అడుగు పెట్టిన తర్వాత 60 నిమిషాల పాటు అత్యున్నత స్థాయిలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం చాలా ముఖ్యం. ఒత్తిడిలోనూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగడంపై దృష్టి పెట్టి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాం. 

సీనియర్‌ స్థాయి ప్లేయర్లను సైతం ఓడించగల ఆత్మస్థైర్యం  ఉన్న ప్లేయర్లను తీర్చిదిద్దుతా’ అని వైట్‌ అన్నాడు. కొత్త కోచ్‌ రాకతో మన హాకీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని హాకీ  ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ అన్నాడు. ‘ఆస్ట్రేలియా, బెల్జియం జూనియర్‌ జట్లకు కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉన్న వైట్‌... భారత జట్టుతో చేరడంతో మన ప్లేయర్ల నైపుణ్యాలు కూడా మరింత పెరుగుతాయి. అతడి అనుభవం మనజట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని టిర్కీ పేర్కొన్నాడు.   

చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌల‌ర్ వైపు క‌న్నెత్తి చూడ‌ను!’

Advertisement
 
Advertisement
Advertisement