‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’ | Hikaru Nakamura is extremely impatient with the excessive precautions being taken by FIDE | Sakshi
Sakshi News home page

‘మేం మోసగాళ్లలా కనిపిస్తున్నామా’

Apr 3 2026 3:56 AM | Updated on Apr 3 2026 3:56 AM

Hikaru Nakamura is extremely impatient with the excessive precautions being taken by FIDE

మొసాద్‌ ఏజెంట్లలా చూస్తున్నారు 

‘ఫిడే’పై హికారు నకమురా ధ్వజం

పెయియా (సైప్రస్‌): ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఆటగాళ్లు ‘మోసాలకు’ పాల్పడకుండా ఉండేందుకు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తీసుకుంటున్న అతి జాగ్రత్తలపై అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హికారు నకమురా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తమను ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ ‘మొసాద్‌’కు చెందిన వ్యక్తుల్లా చూస్తున్నారని అతను ధ్వజమెత్తాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ పురుషుల విభాగంలో పాల్గొంటున్న ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లలో నకమురా ఒకడు. 

ఈ టోర్నీలో విజేతగా నిలిచే ఆటగాడు ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోరులో ప్రస్తుత విజేత గుకేశ్‌ దొమ్మరాజుతో తలపడతాడు. సైప్రస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆటగాళ్లు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేందుకు ‘ఫిడే’ పలు జాగ్రత్తలు తీసుకుంది. మెటల్‌ డిటెక్టర్లతో పాటు ఈసారి మరిన్ని కొత్త తరహా స్కానర్లను టోర్నీ జరిగే వేదికపై ఏర్పాటు చేసింది. ఈ తరహా అతి జాగ్రత్త నకమురాకు ఆగ్రహం తెప్పించింది. 

‘అసలు ఆటగాళ్లు గేమ్‌ ఆడుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారనే ఆలోచనే పనికిమాలినదని అని నా నమ్మకం. కొందరు ఆటగాళ్లే ఇలాంటి ఏర్పాటు కావాలని అడిగారని విన్నాను. ఇది పూర్తిగా అర్థరహితం. గేమ్‌కు ముందు గేమ్‌ తర్వాత కూడా వారు మమ్మల్ని స్కాన్‌ చేస్తున్నారు. మెటల్‌ డిటెక్టర్‌లే కాకుండా వేరుగా ప్రత్యేక స్కానర్లూ ఉన్నాయి. మేమేమైనా ఇరాన్‌లో పని చేస్తున్న ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొసాద్‌ ఏజెంట్లమా? ఫిడే వాస్తవంలోకి రావాలి. మేం చెస్‌ ప్లేయర్లం మాత్రమే’ అని నకమురా వ్యాఖ్యానించాడు. 

అసలు ఈ తరహా ఏర్పాటు చేయడానికి సరైన కారణం కూడా లేదని ఈ అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఆటగాళ్ల మోసం గురించి అతి చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఏదో ఒక చిన్న ఓపెన్‌ టోర్నీ అంటే ఏమైనా అనుకోవచ్చు. అక్కడంటే స్కానర్లవంటివి ఉండవు. కానీ ఇంత పెద్ద టోర్నీలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉన్నారు. కెమెరాలు ఉన్నాయి. ఆర్బిటర్స్‌ ప్రతీ ఒక్కరినీ చూస్తున్నారు. ఎవరో ఒకరు లోపలి నుంచే సహాయం అందిస్తే తప్ప తప్పుడు పనులు చేయడానికి చాన్స్‌ ఉండదు’ అని నకమురా వివరించాడు. 

యుద్ధ వాతావరణం మధ్య సైప్రస్‌లో జరుగుతున్న ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో భారత క్రీడాకారిణి కోనేరు హంపి తప్పుకోగా... టోర్నీ ఆరంభానికి ముందు నకమురా కూడా బహిరంగంగా తన ఆందోళనను వ్యక్తం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement